AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబుల్ ధమాకా.. అటు బరువు తగ్గాలన్నా.. ఇటు బలం రావాలన్నా ఇదొక్కటి చాలు..

జొన్న అంబలి లేదా జొన్న సద్దన్నం సంప్రదాయ ఆహారాల్లో ఒకటి. జొన్నల్లో ఫైబర్‌, ప్రొటీన్‌, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉండటంతో ఇది పోషకమైన అల్పాహారంగా ఉపయోగపడుతుంది. పులియబెట్టే ప్రక్రియ వల్ల లభించే ప్రయోజనాలు జీర్ణవ్యవస్థ, పేగుల ఆరోగ్యానికి తోడ్పడవచ్చు. ఫైబర్‌ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండటానికి, బరువు నియంత్రణకు సహాయపడుతుంది.

డబుల్ ధమాకా.. అటు బరువు తగ్గాలన్నా.. ఇటు బలం రావాలన్నా ఇదొక్కటి చాలు..
Jowar Ambali Benefits
Shaik Madar Saheb
|

Updated on: Sep 01, 2026 | 12:49 PM

Share

శరీరాన్ని చల్లగా ఉంచి, రోజంతా శక్తిని అందించే అల్పాహారాలలో జొన్న అంబలి (లేదా జొన్న సద్దన్నం) ఒకటి.. ఇది రుచితో పాటు అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. సాధారణ ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి అల్పాహారాలకు బదులుగా ఈ సాంప్రదాయ వంటకాన్ని ఎంచుకోవడం వల్ల కడుపులో హాయిగా ఉండడమే కాకుండా, శరీరానికి అవసరమైన అనేక పోషకాలు అందుతాయి. జొన్నల్లో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, పీచు పదార్థం (ఫైబర్), విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే.. పురాతన కాలం మనుషులు శారీరకంగా బలంగా ఉండేవారు.

జొన్న అంబలి ముఖ్యంగా ప్రోబయోటిక్స్ కు గొప్ప మూలం. మన శరీరానికి అవసరమైన మంచి బ్యాక్టీరియా ఈ పులియబెట్టిన ఆహారంలో సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇంకా పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బియ్యంతో చేసే చద్దన్నంతో పోలిస్తే, జొన్న అంబలి బరువు పెరగకుండా చూస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఎలాంటి భయం లేకుండా దీనిని తీసుకోవచ్చు.. ఎందుకంటే జొన్నలలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.

జొన్న అంబలి తయారీ విధానం:

నానబెట్టడం: ఒక కప్పు తెల్ల జొన్నలను (లేదా పచ్చ జొన్నలు) ఒకటి, రెండుసార్లు శుభ్రంగా కడిగి 8 నుండి 10 గంటల పాటు నానబెట్టాలి. బ్రేక్‌ఫాస్ట్ కోసం సిద్ధం చేయాలంటే ముందురోజు మధ్యాహ్నమే నానబెట్టుకోవడం ఉత్తమం.

రుబ్బడం: నానిన జొన్నలలోని నీటిని వంపేసి, మిక్సీ జార్ లోకి వేసి నీళ్లు పోయకుండా పల్స్ మోడ్‌లో ఆపుకుంటూ రుబ్బుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేలా చూసుకోవాలి.

ఉడికించడం: రుబ్బుకున్న జొన్న పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని, అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు పోసి మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మంటను తగ్గించి, ముందుగా కలిపి పెట్టుకున్న జొన్న పిండి మిశ్రమాన్ని వేసి, ఉండలు కట్టకుండా వెంటనే కలుపుతూ ఉండాలి.

ఫెర్మెంటేషన్: మిశ్రమం చిక్కబడిన తర్వాత, మంటను పూర్తిగా తగ్గించి, మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ సుమారు 15 నిమిషాల పాటు ఉడికించాలి. మాడిపోకుండా జాగ్రత్తపడాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆపి, మూత పెట్టి 8-10 గంటల పాటు లేదా రాత్రంతా పులియనివ్వాలి.

చివరి మెరుగులు: పులిసిన జొన్న అన్నం మరుసటి రోజు ఉదయానికి గట్టిగా మారుతుంది. దీనిని బాగా కలిపి, ముందుగా తోడుపెట్టిన చిలికిన పెరుగు లేదా పల్చటి మజ్జిగను వేసి, ఉండలు లేకుండా బాగా కలపాలి. రుచికి సరిపడా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కలుపుకుంటే జొన్న అంబలి సిద్ధం. కొందరు రుచి కోసం కొద్దిగా ఉప్పును కూడా కలుపుకుంటారు.

వివిధ రకాల చిరుధాన్యాలతో అంబలి:

జొన్నలతో పాటు కొర్రలు, ఊదలు, అరికెలు వంటి ఇతర చిరుధాన్యాలతో కూడా ఇదే పద్ధతిలో అంబలిని తయారుచేసుకోవచ్చు. ప్రతి చిరుధాన్యం దాని స్వంత పోషక విలువలను కలిగి ఉంటుంది. ఈ అంబలిని రోజూ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడటంతో పాటు, శరీరానికి చలువ చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. బరువును అదుపులో ఉంచుకుని.. పలు సమస్యల నుంచి బయటపడేందుకు.. తప్పకుండా ప్రయత్నించాల్సిన ఆరోగ్యకరమైన వంటకం ఇదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us