త్వరలో వైట్ హౌస్ లో కాలు పెట్టనున్న కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ శ్వేతసౌథంలో పని చేసే ప్రెస్ టీమ్ లో అంతా మహిళలనే నియమించారు. దేశ చరిత్రలో ఇలాంటి నియామకాలు జరగడం ఇదే మొదటిసారని బైడెన్ కార్యాలయవర్గాలు తెలిపాయి. మొత్తం మహిళలతో కూడిన మొట్టమొదటి సీనియర్ వైట్ హౌస్ కమ్యూనికేషన్ టీమ్ ను ప్రకటిస్తున్నందుకు గర్వంగా ఉందని బైడెన్ అన్నారు. ఈ టీమ్ లో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా నియమితులైన జెన్ సాకి ముఖ్య వ్యక్తి అని బైడెన్ కార్యాలయం పేర్కొంది. లోగడ బరాక్ ఒబామా హయాంలో ఈమె వైట్ హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఈమెతో బాటు మరో ఆరుగురు మహిళలు కూడా నియమితులయ్యారు. బైడెన్ డిప్యూటీ కాంపెయిన్ మేనేజర్ అయిన కేట్ ను వైట్ హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్ గా నియమించగా..బైడెన్ భార్య జిల్ కి కమ్యూనికేషన్ డైరెక్టర్ గా ఎలిజిబెత్ అలెగ్జాండర్ వ్యవహరించనున్నారు. ఈ నియామకాలను సెనేట్ ధృవీకరించవలసిన అవసరం లేదు.
తమను ఈ పదవుల్లో నియమించినందుకు వీరంతా జో బైడెన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక యుఎస్ ట్రెజరీ హెడ్ గా జానెట్ ఎలెన్ ని బైడెన్ ఎంపిక చేశారు. ఈమె నియామకాన్ని సెనేట్ ధృవీకరించాల్సి ఉంది. ఇలా ఉండగా డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన ఓటమిని అంగీకరించే ప్రసక్తే లేదని అంటున్నారు. ఆరు నెలలైనప్పటికీ తన మైండ్ సెట్ మారదని ఢంకా బజాయిస్తున్నారు. ఈయన మంకుపట్టును ఎలా వదిలించుకోవాలన్నది బైడెన్ కు పెద్ద సమస్యగా మారింది.