పార్టీని స్ధాపించి ఆరేళ్లు గడిచినా ఇప్పటికీ సంస్ధాగత లోపాలతో నెట్టుకొస్తోంది జనసేన పార్టీ. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఒకేఒక్క ఎమ్మెల్యేను మాత్రమే గెలుపించుకున్న ఏకైక పార్టీగా మిగిలిపోయింది. స్వయంగా పార్టీ అధినేత పవన్ పోటీ చేసిన రెండుస్ధానాల్లో కూడా ఓటర్లు ఆయనను తిరస్కరించారు. అయినప్పటికీ జనసేన పార్టీ సుధీర్ఘకాలం రాజకీయం చేయడానికే పుట్టిందని చెప్పుకొస్తున్నారు అధినేన పవన్‌కళ్యాణ్. ఇదిలా ఉంటే పార్టీకి ఒక్కొక్క నేత రాజీనామా చేస్తుండటంతో ప్రస్తుతం ఆ పార్టీ అస్తిత్వానికే సవాలుగా పరిణమించింది.
అయితే పార్టీలో సీనియర్ నేతగా కొనసాగుతూ అనకాపల్లి ఎంపీ స్ధానం నుండి పోటీ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చింతల పార్ధసారథి గుడ్‌బై చెప్పడం ఆ పార్టీ భవిష్యత్తును తెలియజేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వెళుతూ వెళుతూ పార్టీ పరిస్థితిని తెలియజేయడం జనసేనానికి ఇబ్బందిపెట్టే అంశంగా మారింది. తాజాగా రాజీనామా చేసిన పార్థసారధి పలు విమర్శలు చేశారు.
జనసేనలో ఇప్పటికీ పార్టీ నిర్మాణం జరగలేదని, దీనికి కారణం పవన్ కళ్యాణే అంటూ ఆరోపించారు. ఒకవేళ పార్టీనిక సంస్ధాగతంగా నిర్మాణం చేపడితే తన అభిమానులు ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతోనే అలా చేయడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రాంతీయపార్టీల్లో కుటుంబపాలన, కులతత్వం బాగా మితిమీరిపోయిందన్నారు. కుటుంబ పాలనకు వ్యతిరేకమని చెప్పి నాగబాబుకు టికెట్ ఇవ్వడంతో పవన్ మాటతప్పినట్టయ్యిందన్నారు. బీజేపీలో అటువంటిది విధానాలు ఎక్కడా లేవని. బీజేపీ తీసుకునే నిర్ణయాలతో తాత్కాలికంగా నొప్పి కలిగినా దీర్ఘకాలంలో ప్రయోజనాలుంటాయని వ్యాఖ్యానించారు పార్థసారథి. కుటుంబ పాలన ఎక్కడా కనిపించని, జాతీయభావాలుగల బీజేపీలో తాను చేరబోతున్నట్టు ఆయన తెలిపారు.