జగన్ వెంటే జనసేన ఎమ్మెల్యే.. అసలు మేటరేంటి.?

| Edited By: Srinu

Nov 25, 2019 | 2:14 PM

ఊరంతా ఒక దారి అంటే ఉలికిపిట్టది ఒక దారి అన్నారు… ఈ సామెత రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావుకు సరిగ్గా సరిపోతుంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటుగా పలువురు పెద్దలు జగన్‌పై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తుంటే.. ఈయన మాత్రం అందుకు విరుద్ధంగా జగన్ సభలకు హాజరై అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరంలో వైసీపీ నేతలు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దీనికి ఏపీ సీఎం వైఎస్ […]

జగన్ వెంటే జనసేన ఎమ్మెల్యే.. అసలు మేటరేంటి.?
Follow us on

ఊరంతా ఒక దారి అంటే ఉలికిపిట్టది ఒక దారి అన్నారు… ఈ సామెత రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావుకు సరిగ్గా సరిపోతుంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటుగా పలువురు పెద్దలు జగన్‌పై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తుంటే.. ఈయన మాత్రం అందుకు విరుద్ధంగా జగన్ సభలకు హాజరై అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరంలో వైసీపీ నేతలు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దీనికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేయడమే కాకుండా వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని కూడా ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటుగా రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు కూడా హాజరయ్యి.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

అప్పుడెప్పుడో అసెంబ్లీలో సీఎం జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తిన రాపాక.. ఆ తర్వాత జగన్ ఫొటోకు పాలాభిషేకం చేస్తున్నట్లుగా ఆయన చిత్రం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అటు మొన్నీమధ్య వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఇక ఇప్పుడు మళ్ళీ సీఎం జగన్ సభకు హాజరు కావడం రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపింది. రాపాక పార్టీ మారే యోచనలో ఉన్నారా.? లేదా జగన్ సభకు హాజరు కావడం వెనుక ఏదైనా రహస్యం ఉందా.? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం కింద మత్స్యకార కుటుంబాలకు ఏటా రూ.10 వేలు జగన్ సర్కార్ ఇవ్వనుంది.