‘మన్కడింగ్’ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్.. తర్వాత నన్ను నిందించవద్దు: అశ్విన్
ఈ ఏడాది రవిచంద్రన్ అశ్విన్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. నిన్న రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఓపెనర్ ఆరోన్ ఫించ్‌ను మన్కడింగ్ చేసే...
‘మన్కడింగ్’.. ఈ పేరు వినగానే మొదటిగా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ గుర్తొస్తాడు. గతేడాది ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్‌ను అశ్విన్ ‘మన్కడింగ్’ ఔట్ చేయడం పెద్ద వివాదాస్పదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. కొంతమంది ఈ ఔట్‌ను సమర్ధించినా.. చాలామంది ‘మన్కడింగ్’ను తప్పుబట్టడమే కాకుండా అశ్విన్‌పై విమర్శలు గుప్పించారు. అయితే అశ్విన్ మాత్రం ‘తాను చేసింది తప్పు కాదని.. క్రికెట్‌లో ఈ రూల్ ఉందంటూ’ తన వాదనను వినిపించాడు. (R Ashwin gives ‘mankad’ warning to Aaron Finch)
ఇదిలా ఉంటే ఈ ఏడాది రవిచంద్రన్ అశ్విన్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. నిన్న రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఓపెనర్ ఆరోన్ ఫించ్‌ను మన్కడింగ్ చేసే అవకాశం వచ్చినా అశ్విన్ దాన్ని వదిలేశాడు. అశ్విన్ బంతి వేయకముందే ఫించ్ క్రీజు దాటి ముందుకు వెళ్ళాడు. దీనితో బంతి వేయడం ఆపేసిన అశ్విన్.. అతడికి వార్నింగ్ ఇచ్చి వెనక్కి వెళ్ళిపోతూ అంపైర్‌ను చూసి నవ్వాడు.
ఇక గతేడాది జరిగిన మన్కడింగ్ వివాదంపై రికీ పాంటింగ్.. అశ్విన్‌తో చర్చించాడని.. అది గేమ్ అఫ్ స్పిరిట్ కాదని చెప్పాడని.. అందుకే ఇప్పుడు అశ్విన్ స్వీట్ వార్నింగ్‌తో సరిపెట్టుకున్నాడని కామెంటేటర్లు చమత్కరించారు. దీనితో కెమెరాల ఫోకస్ అంతా కూడా ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ వైపు మళ్లాయి. కాగా, మ్యాచ్ అనంతరం మన్కడింగ్‌పై అశ్విన్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ”మీ అందరికి ఒకటి స్పష్టం చేస్తున్నా. ఐపీఎల్ 2020లో బ్యాట్స్‌మెన్‌కు ఇదే నా మొదట, చివరి హెచ్చరిక. నేను ఇప్పుడే దీన్ని అఫీషియల్‌గా చెప్పేస్తున్నా.. తరువాత ‘మన్కడింగ్’ విషయంలో మళ్లీ నన్ను నిందించవద్దు” అంటూ అశ్విన్ చక్కటి ట్వీట్ చేశాడు. దీంతో మరోసారి మన్కడింగ్ మీద చర్చ మొదలైంది.
Let’s make it clear !! First and final warning for 2020. I am making it official and don’t blame me later on. @RickyPonting #runout #nonstriker @AaronFinch5 and I are good buddies btw.?? #IPL2020
— Ashwin ?? (@ashwinravi99) October 5, 2020