ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. పరీక్ష రాయకుండానే పాస్..
మార్చిలో నిర్వహించిన వార్షిక పరీక్షలకు హాజరుకాలేకపోయిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులనూ ఉత్తీర్ణులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
మార్చిలో నిర్వహించిన వార్షిక పరీక్షలకు హాజరుకాలేకపోయిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులనూ ఉత్తీర్ణులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇటీవలే ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. ఈ ప్రతిపాదన అందినందున త్వరలోనే ఆమోదం తెలుపుతూ అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ రెండో సంవత్సరానికి చెందిన సుమారు 27 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
తెలంగాణ వ్యాప్తంగా మార్చి నెలలో జరిగిన ఇంటర్ పరీక్షలకు సుమారు 4.30 లక్షల మంది సెకండ్ ఇయర్ విద్యార్థలు హాజరుకాగా వారిలో 2,83,462 మంది ఉత్తీర్ణులయ్యారు. కరోనా నేపథ్యంలో.. ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిపే అవకాశం లేకపోవడంతో వాటిని రద్దు చేశారు. పరీక్షలు రాసి తప్పిన ద్వితీయ సంవత్సరం విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు జులై 19వ తేదీన ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దాదాపు 1.47 లక్షల మందికి తప్పిన సబ్జెక్టుల్లో కనీస పాస్ మార్కులు ఇచ్చి ఉత్తీర్ణులను చేశారు.
ఫీజులు కట్టి వివిధ కారణాల వల్ల పరీక్షలు రాయలేకపోయిన విద్యార్థులు ఇంకా 27 వేల మంది వరకు ఉన్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. వీరందరు సప్లిమెంటరీ రాయాలని అనుకున్నా ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. ఈ క్రమంలో వారికి కూడా కనీస మార్కులు ఇచ్చి పాస్ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. దీంతో వీరందరు ఎగ్జామ్ రాయకుండానే డిగ్రీ చదివేందుకు రాష్ట్రప్రభుత్వం అవకాశం కల్పించనుంది.