AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INCOIS: సముద్రానికి 600 కిలో మీటర్ల దూరంలో ఉండి.. సునామీ రాకను సెకన్లలో కనిపెట్టే రీసెర్చ్ సెంటర్..

హైదరాబాద్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది బిర్యానీ, చార్మినార్. కానీ చుట్టుపక్కల ఎక్కడా సముద్రం జాడ లేని ఈ నగరం.. సముద్రంలో సంభవించే సునామీలను గుర్తించి ప్రజల ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తోందని మీకు తెలుసా? అవును సముద్రం ఆగ్రహించి సునామీగా మారితే, దేశంలోనే మొదటి హెచ్చరిక జారీ అయ్యేది మన హైదరాబాద్ నుంచే! అదెలానో తెలుసుకోవాలంటే ఈస్టోరీ చదవాల్సిందే.

INCOIS: సముద్రానికి 600 కిలో మీటర్ల దూరంలో ఉండి.. సునామీ రాకను సెకన్లలో కనిపెట్టే రీసెర్చ్ సెంటర్..
Incois Hyderabad
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Jul 01, 2026 | 5:27 PM

Share

హైదరాబాద్‌కు సముద్రంతో ప్రత్యక్ష సంబంధం లేదు. సమీప తీర ప్రాంతం కూడా దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయినప్పటికీ దేశంలోనే అత్యంత కీలకమైన సముద్ర పరిశోధన, సునామీ హెచ్చరికల కేంద్రం మాత్రం ఈ నగరంలోనే ఉండటం విశేషం. ప్రగతి నగర్‌లో ఉన్న ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) గత రెండు దశాబ్దాలుగా భారత మహాసముద్రాన్ని నిరంతరం పరిశీలిస్తూ దేశానికే కాకుండా పలు దేశాలకు కీలక సేవలు అందిస్తోంది.

1999లో కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సంస్థ ఉపగ్రహాలు, సముద్ర పరిశీలనా పరికరాలు, భూకంప కేంద్రాలు, అత్యాధునిక కంప్యూటర్ నమూనాల సహాయంతో సముద్రంలో చోటుచేసుకునే పరిణామాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తుంది. మత్స్యకారుల నుంచి నౌకాయాన సంస్థలు, పరిశోధకుల నుంచి విపత్తు నిర్వహణ సంస్థల వరకు అనేక రంగాలకు అవసరమైన సమాచారాన్ని అందిస్తోంది. సముద్ర గర్భంలో భారీ భూకంపం సంభవించిన క్షణాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూకంప పరిశీలనా కేంద్రాల నుంచి సమాచారం హైదరాబాద్‌లోని INCOISకు చేరుతుంది.

భూకంప తీవ్రత, లోతు, కేంద్రాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు, సముద్రంలో ఏర్పాటు చేసిన టైడ్ గేజ్‌లు, డీప్ ఓషన్ సెన్సర్ల నుంచి వచ్చే సమాచారాన్ని పరిశీలించి నిజంగా సునామీ అలలు ఏర్పడ్డాయా లేదా నిర్ధారిస్తారు. అనంతరం ప్రత్యేక కంప్యూటర్ నమూనాల ద్వారా అలలు ఏ తీర ప్రాంతాలకు, ఎంత సమయంలో చేరుకునే అవకాశం ఉందో అంచనా వేసి వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విపత్తు నిర్వహణ సంస్థలకు హెచ్చరికలు జారీ చేస్తారు. ఈ విలువైన సమయమే వేలాది మంది ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడుతుంది.

హైదరాబాద్‌లోని ఈ కేంద్రం సేవలు భారత్‌కే పరిమితం కావు. భారత మహాసముద్ర పరిధిలోని పలు దేశాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ సేవలను గుర్తించిన యునెస్కో, INCOISను ప్రాంతీయ సునామీ సేవల ప్రదాతగా గుర్తించింది. సునామీ హెచ్చరికలతోనే INCOIS బాధ్యత ముగియదు. ప్రతి రోజు ఉపగ్రహాల ద్వారా చేపలు ఎక్కువగా లభించే ప్రాంతాలను గుర్తించి మత్స్యకారులకు సమాచారం అందిస్తుంది. అలాగే సముద్ర అలల ఎత్తు, ప్రవాహాల వేగం, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత వంటి వివరాలతో ఏడు రోజుల ముందుగానే సముద్ర పరిస్థితులపై అంచనాలు విడుదల చేస్తుంది.

ఈ సమాచారం మత్స్యకారులు, నౌకాశ్రయాలు, షిప్పింగ్ సంస్థలు, నౌకాదళం, కోస్ట్‌గార్డ్ కార్యకలాపాలకు ఎంతో ఉపయోగపడుతోంది. సముద్ర పరిశోధనలకు అవసరమైన సమాచారాన్ని భద్రపరచడంతో పాటు, సునామీలు, తుఫాన్లు, భారీ అలలపై మరింత కచ్చితమైన అంచనాలు రూపొందించేందుకు పరిశోధనలు నిర్వహించడం, శాస్త్రవేత్తలకు శిక్షణ ఇవ్వడం కూడా ఈ సంస్థ ప్రధాన బాధ్యతల్లో భాగమే.

సముద్రం లేని హైదరాబాద్‌లోనే.. సముద్రం ఆగ్రహిస్తే మొదటి హెచ్చరిక వెలువడుతుంది. అందుకే దేశ తీర ప్రాంతాల భద్రత వెనుక నిశ్శబ్దంగా పనిచేస్తున్న కీలక శాస్త్రీయ కేంద్రంగా హైదరాబాద్‌లోని INCOIS ప్రత్యేక గుర్తింపు పొందింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us