మాల్దీవులు వేదికగా పాకిస్తాన్ కు పరాభవం!

అంతర్జాతీయ వేదికపై కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించి పాకిస్థాన్‌ మరోసారి అపహాస్యం పాలైంది. మాల్దీవుల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఈ ఘటన జరిగింది. పాక్‌ ప్రతినిధి కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తడంతో భారత్‌ దాన్ని దీటుగా తిప్పికొట్టింది. భారత అంతర్గత అంశాన్ని ప్రస్తావించి పాకిస్థాన్‌ ఈ వేదికను రాజకీయ అవసరాల కోసం వాడుకోవాలని చూస్తోందని భారత్‌ మండిపడింది. ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అధిగమించడం’ అన్న అంశంపై సదస్సు కోసం మాల్దీవుల పార్లమెంటు భవనం వేదికైంది. ఈ సదస్సుకు […]

మాల్దీవులు వేదికగా పాకిస్తాన్ కు పరాభవం!
India-Pakistan
Follow us

| Edited By:

Updated on: Sep 02, 2019 | 6:00 AM

అంతర్జాతీయ వేదికపై కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించి పాకిస్థాన్‌ మరోసారి అపహాస్యం పాలైంది. మాల్దీవుల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఈ ఘటన జరిగింది. పాక్‌ ప్రతినిధి కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తడంతో భారత్‌ దాన్ని దీటుగా తిప్పికొట్టింది. భారత అంతర్గత అంశాన్ని ప్రస్తావించి పాకిస్థాన్‌ ఈ వేదికను రాజకీయ అవసరాల కోసం వాడుకోవాలని చూస్తోందని భారత్‌ మండిపడింది. ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అధిగమించడం’ అన్న అంశంపై సదస్సు కోసం మాల్దీవుల పార్లమెంటు భవనం వేదికైంది. ఈ సదస్సుకు భారత్‌ నుంచి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ హాజరయ్యారు.పార్లమెంటులో సుస్థిరాభివృద్ధిపై చర్చ జరుగుతుండగా, పాకిస్థాన్‌ నుంచి హాజరైన ప్రతినిధి ఖాసిమ్‌ సూరీ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. కశ్మీరీల అణచివేతను తాము సహించేది లేదని వ్యాఖ్యానించడంతో సభలో నిరసనలు మొదలయ్యాయి. పాక్‌ తీరుకు భారత ప్రతినిధులు ఓం బిర్లా, నారాయణ్‌ సింగ్‌ దీటుగా బదులిచ్చారు. ”కశ్మీర్‌ అంశాన్ని ఈ వేదికపై లేవనెత్తడాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అది భారత అంతర్గత వ్యవహారం. ఇలాంటి అంశాలు లేవనెత్తి సదస్సును రాజకీయ అవసరాల కోసం వాడుకోవడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం” అని వ్యాఖ్యానించారు.

అనంతరం పాకిస్థాన్‌ ఉగ్రవాదానికి మద్దతు నిలిపివేయాలని సింగ్‌ డిమాండ్‌ చేశారు. ఈ సదస్సు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన కోసం ఉద్దేశించినదని, పాక్‌ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని భారత్‌ డిమాండ్‌ చేసింది. వెంటనే పాకిస్థాన్ మరో ప్రతినిధి ఖురాత్‌ ఉల్‌ ఐన్‌ మర్రి వాదనకు దిగడంతో ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న మాల్దీవుల స్పీకర్‌ మహ్మద్‌ నషీద్‌ ఆమెను అడ్డుకున్నారు. ఒకప్పుడు తమ సొంత ప్రజలైన బంగ్లాదేశీయులపై మారణ హోమానికి తెగబడ్డ దేశానికి కశ్మీర్ సమస్య లేవనెత్తే నైతిక హక్కు లేదని భారత్‌ ఉద్ఘాటించింది. చివరికి పాక్‌ లేవనెత్తిన అంశాలన్నీ రికార్డుల నుంచి తొలగిస్తామని మాల్దీవుల స్పీకర్‌ నషీద్‌ భారత ప్రతినిధులకు హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.