Young Lady Given Two Shots Covid Vaccine: రోగులకు వైద్యం చేసి కొంతమంది దేవుళ్లు అయితే… మరికొంత మంది వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆ వృత్తికే కలంకం ఏర్పడుతుంది. వృత్తి ధర్మాన్ని నిర్వహించాల్సిన వ్యక్తులు మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొంతమంది వైద్యసిబ్బంది తాము చేయాల్సిన వైద్యానికి బదులుగా మరో రకమైన చికిత్స చేయడం లేదంటే ఆపరేషన్ చేసి కడుపులోనే కత్తులు మరిచిపోవడంతో పాటు వైద్య చికిత్సలో వింత వింత సంఘటలనకు కారణమవుతారు కొంతమంది వైద్యులు. తాజాగా వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి సంబంధించి ఇలాంటి సంఘటనే ఒకటి హైదరాబాద్ శివారులో జరిగింది.
కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. అయితే, ఒక వ్యక్తికి ఒక డోసు మాత్రమే టీకా అందించాల్సి ఉంటుంది. అయితే హైదరాబాద్ శివారు ప్రాంతంలోని హయత్‌నగర్ మండలం అబ్దల్లాపూర్ మెట్‌లో ఓ యువతికి నిమిషాల వ్యవధిలో రెండో డోసు వేశారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన మహిళ ఆసుపత్రి పాలయ్యారు. బుధవారం బీహార్ రాజధాని పాట్నా శివారులో జరిగిన ఇలాంటి ఘటన మరువక ముందే హైదరాబాద్ శివారులో మరో ఘటనల అలస్యంగా వెలుగులోకి వచ్చింది .
హయత్‌నగర్ మండలం కుంట్లూరు రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన లక్ష్మీ ప్రసన్న(21) వ్యాక్సిన్ వేసుకునేందుకు బుధవారం అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వచ్చింది. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న నర్సు పద్మ.. ఆ యువతికి ఒక డోసు వ్యాక్సిన్ వేసింది. తనకు టీకా పూర్తి అయ్యిందని తెలియక ఆమె అలాగే కూర్చుండిపోయింది. అయితే, వ్యాక్సిన్ ఇచ్చిన నర్సుకు ఫోన్ కాల్ రావడంతో.. మాట్లాడుతూ రెండో వాక్సిన్ ఇచ్చేసింది. వాక్సిన్ అనంతరం కళ్లు తిరగడంతో కింద పడిపోయింది యువతి లక్ష్మీ ప్రసన్న. దీంతో అక్కడే ఉన్న స్థానికులు వైద్య సిబ్బంది సాయంతో వనస్థలిపురం ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. యువతిని ప్రత్యేక వార్డులో ఉంచి అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో రంగారెడ్డి జిల్లా వైద్యాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. సదరు యువతిని అబ్జర్వేషన్‌లో ఉంచి పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.