Loan Apps Scam : లోన్‌ యాప్‌ తీగలాగితే.. బిట్ కాయిన్ కంప కదిలింది.. కొలిక్కి వచ్చిన కేసు

|

Jan 05, 2021 | 8:25 PM

వాళ్లు కంటికి కనిపించని రాక్షసులు. ఆర్ధిక అవసరాలు తీరుస్తూ జనాన్ని పీక్కుతునే రాబంధులు. ఈమాఫియా కదలికల్ని పసిగడుతూనే మూలాల్ని పెకిలిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు.

Loan Apps Scam : లోన్‌ యాప్‌ తీగలాగితే.. బిట్ కాయిన్ కంప కదిలింది.. కొలిక్కి వచ్చిన కేసు
Follow us on

Loan App Transactions : పేర్లే వేరు..వాటి లక్ష్యం ఒక్కటే. అడిగిన వెంటనే అప్పు ఇవ్వడం…వేధిస్తూ వసూలు చేసుకోవడం. ఇది ఓ పెద్ద మనీ యాప్‌ మాఫియాగా మారింది. వీళ్ల ఉచ్చులో పడి ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ప్రాణాలు వదిలేశారు. పరిస్థితి సీరియస్‌గా మారడంతో హైదరాబాద్‌ పోలీసులు మనీ లోన్‌ యాప్‌ల అరాచకాలకు చెక్‌ పెట్టాలని చూస్తున్నారు.

వేర్వేరు చోట్ల నుంచి బాధితులు వేల సంఖ్యలో బయటకు రావడంతో అసలు ఈ మనీ యాప్‌ మూలాలపై ఫోకస్ పెట్టారు హైదరాబాద్‌ క్రైమ్‌ బ్రాంచ్ పోలీసులు. ఈ మనీ సర్ల్యూలేషన్ ఆపరేషన్‌ ఎక్కడి నుంచి జరుగుతుందో కనుగొంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు 28 కేసుల్లో 17మందిని అరెస్ట్‌ చేశారు. ఆర్ధిక లావాదేవీలు జరుపుతున్న 27 బ్యాంక్‌ అకౌంట్లకు సంబంధించి 102 కోట్ల రూపాయల క్యాష్‌ని ఫ్రీజ్‌ చేశారు. 122 లోన్‌యాప్‌లను గుర్తించారు.

మన దేశంలోనే వివిధ ప్రాంతాల నుంచి యాప్‌ల లావాదేవీలు నడుస్తున్నట్లుగా గుర్తించారు. మొత్తం ఆరు వేల కాల్‌ సెంటర్లను సీజ్ చేశారు. ఈ కాల్‌ సెంటర్లలో పనిచేస్తున్న రెండు వేల మంది టెలీ కాలర్లు జనాన్ని వేధింపులకు గురి చేసినట్లుగా రాబట్టారు. బిట్‌ కాయిన్ రూపంలో జరిగిన లావాదేవీలపై కీలక సమాచారం రాబడుతున్నారు హైదరాబాద్‌ పోలీసులు. లోన్‌ యాప్ నిర్వాహకుల అరాచకాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధితులు ఎవరైనా ఉంటే వేధింపులపై ….ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు అడిషినల్‌ సీపీ క్రైమ్‌ షికాగోయల్. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని…లోన్ యాప్‌ల భరతం పడతామని భరోసా ఇచ్చారు.

పోలీసులు ఆపరేషన్ హంటింగ్ కొనసాగిస్తున్నప్పటికి ..కొత్త పేర్లతో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి మరికొన్ని లోన్ యాప్‌లు. వేధింపుల పేరుతో బలైపోతున్న వాళ్లను చూసైన జాగ్రత్త పడటం తప్ప చేయగలిగింది ఏమీ లేదంటున్నారు పోలీసులు.