బంగ్లాదేశ్‌లో రాముడి విగ్రహ వివాదం.. ‘జై శ్రీరామ్’ నినాదాలతో మార్మోగిన ఢాకా..!
బంగ్లాదేశ్‌లో శ్రీరాముడి విగ్రహ నిర్మాణం చుట్టూ నెలకొన్న వివాదం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. రంగపూర్ విభాగంలోని గైబంధా జిల్లా పలాష్‌బారిలో నిర్మాణంలో ఉన్న 81 అడుగుల ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని వ్యతిరేకిస్తూ ఇస్లామిస్ట్ వర్గాలు ఒత్తిడి తెచ్చాయి. అదే సమయంలో శ్రీరాముడి చిత్రపటాన్ని అవమానించారనే ఆరోపణలతో వేలాది మంది హిందువులు ఢాకాలో భారీ నిరసనలు చేపట్టారు.

శుక్రవారం (జూన్ 19) హిందూ మహాజోత్ పిలుపు మేరకు హిందూ సంస్థలు, విద్యార్థులు ఢాకాలోని షాబాగ్ కూడలి వద్ద భారీగా గుమిగూడి, నేషనల్ ప్రెస్ క్లబ్ వరకు కాగడాల ర్యాలీ నిర్వహించారు. నిరసనకారులు “జై శ్రీరామ్” నినాదాలు చేస్తూ, శ్రీరాముడి చిత్రాన్ని అవమానించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు జరగలేదని వారు ఆరోపించారు.
జూన్ నెల ప్రారంభంలో గైబంధాలో జరిగిన ఒక ప్రదర్శన సందర్భంగా కొందరు శ్రీరాముడి చిత్రంపై బూటు పెట్టి అవమానించారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 72 గంటల గడువు కూడా విధించాయి. డిమాండ్లు నెరవేరకపోతే దేశవ్యాప్తంగా మరిన్ని ఆందోళనలు చేపడతామని హెచ్చరించాయి.
ఇదిలా ఉండగా, పలాష్‌బారిలో నిర్మిస్తున్న 81 అడుగుల శ్రీరామ విగ్రహం పనులు ప్రస్తుతం నిలిచిపోయాయి. కొన్ని ఇస్లామిస్ట్ గ్రూపుల నుంచి బెదిరింపులు రావడంతో భద్రతా కారణాల రీత్యా నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేశామని ఆలయ కమిటీ తెలిపింది. దాదాపు 80 శాతం పనులు పూర్తయిన ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు 22 కోట్ల బంగ్లాదేశ్ టాకాలుగా అంచనా వేస్తున్నారు.
బంగ్లాదేశ్‌లో హిందువులు అతిపెద్ద మత మైనారిటీ వర్గంగా ఉన్నప్పటికీ, ఇటీవల మతపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని మత సామరస్యాన్ని కాపాడాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..