ఇల్లు కడుతున్నారా? పిల్లర్ సైజు ఎంత ఉండాలో తెలుసుకోండి.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ప్రతి ఒక్కరి జీవితంలో సొంతింటి నిర్మాణం అనేది ఒక పెద్ద కల. భవనం ఎంత అందంగా కనిపిస్తుందో, దాని పునాదులు, పిల్లర్లు కూడా అంతే దృఢంగా ఉండాలి. ఇల్లు ఎన్ని సంవత్సరాలైనా చెక్కుచెదరకుండా నిలబడాలంటే పిల్లర్ల పరిమాణం, వాడే పదార్థాల నాణ్యత చాలా ముఖ్యం. అనేకమంది నిర్మాణ సమయంలో పిల్లర్ సైజు విషయంలో పొరపాట్లు చేసి భవిష్యత్తులో సమస్యలు కొనితెచ్చుకుంటారు. ఇల్లు కట్టేటప్పుడు పిల్లర్ల సైజు ఎంత ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

సొంతిల్లు నిర్మించుకునేటప్పుడు భవనం దృఢత్వానికి పిల్లర్లు అత్యంత కీలకమైనవి. చాలామంది ఇంటి నిర్మాణంలో పిల్లర్ల పరిమాణం, వాడే ఇనుప కడ్డీల గురించి సరైన అవగాహన లేక పొరపాట్లు చేస్తుంటారు. నిర్మాణంలో నాణ్యమైన కంక్రీట్ మిశ్రమాన్ని వాడటం, రెండు పిల్లర్ల మధ్య సరైన దూరం పాటించడం భవనానికి దీర్ఘకాలిక మన్నికను, భూకంపాలను తట్టుకునే శక్తిని అందిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఒకే అంతస్తు ఇల్లు:
మీరు కేవలం గ్రౌండ్ ఫ్లోర్ ఒకే అంతస్తు మాత్రమే నిర్మించాలని ప్లాన్ చేస్తుంటే:
పిల్లర్ సైజు: కనీసం 9 x 9 అంగుళాలు (225mm x 225mm) ఉండాలి.
ఇనుప కడ్డీలు : పిల్లర్‌లో కనీసం 12mm మందం కలిగిన 4 ప్రధాన ఇనుప కడ్డీలను ఉపయోగించాలి.
రింగులు: 8mm కడ్డీలతో చేసిన రింగులను 6 అంగుళాల (150mm) దూరంతో అమర్చాలి.
రెండు అంతస్తుల ఇల్లు :
గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు పైన మరొక అంతస్తు (జి+1) నిర్మించాలనుకుంటే భారం పెరుగుతుంది. కాబట్టి, పిల్లర్ సైజు: కనీసం 9 x 12 అంగుళాలు (225mm x 300mm) ఉండాలి.
ఇనుప కడ్డీలు: కనీసం 12mm మందం కలిగిన 6 ప్రధాన కడ్డీలను ఉపయోగించడం సురక్షితం.
పిల్లర్ల మధ్య దూరం:
రెండు పిల్లర్ల మధ్య దూరం చాలా కీలకం. సాధారణంగా రెండు పిల్లర్ల మధ్య గరిష్టంగా 4 నుండి 5 మీటర్లు (సుమారు 13 నుండి 16 అడుగులు) దూరం ఉండవచ్చు. పిల్లర్ల మధ్య దూరం పెరిగితే, పిల్లర్ సైజు, ఉపయోగించే ఇనుము పరిమాణాన్ని కూడా పెంచాల్సి ఉంటుంది.
ముఖ్యమైన జాగ్రత్తలు:
కన్సల్టింగ్ ఇంజనీర్ సలహా: స్థలం మట్టి స్వభావం బట్టి పిల్లర్ల లోతు, సైజు మారుతాయి. కాబట్టి, నిర్మాణానికి ముందు క్వాలిఫైడ్ సివిల్ ఇంజనీర్ లేదా స్ట్రక్చరల్ ఇంజనీర్ ప్లాన్ తీసుకోవడం తప్పనిసరి.
కాస్ట్, క్యూరింగ్: పిల్లర్ నింపేటప్పుడు M20 గ్రేడ్ (1:1.5:3 శాతంలో సిమెంట్, ఇసుక, కంక్రీట్) కాంక్రీట్ వాడాలి. నిర్మాణం పూర్తయిన తర్వాత కనీసం 7 నుండి 10 రోజుల పాటు తగినంత నీటితో క్యూరింగ్ (తడిపడం) చేయాలి.
సరైన సైజు, నాణ్యమైన నిర్మాణ పద్ధతులు పాటించడం వల్ల మీ ఇల్లు తరతరాల పాటు సురక్షితంగా ఉంటుంది.
గమనిక: ఇంటర్ నెట్ లో దొరికిన సమాచారం, నిపుణుల సూచనలు వంటి అంశాల ఆధారంగా అందించిన వివరాలు మాత్రమే. పిల్లర్ల సైజు, రాడ్ల సంఖ్య, దూరం వంటి వివరాలను అన్ని ఇళ్లకూ వర్తించే సురక్షిత ప్రమాణాలుగా పాటించకండి. నిర్మాణానికి ముందు స్ట్రక్చరల్ ఇంజనీర్‌తో డిజైన్‌ను నిర్ధారించుకోవాలి.




