
కొవిడ్ మహమ్మారి వేళ ఐదారు నెలలుగా తెలంగాణలో రిజిస్ట్రార్ ఆఫీసులు తెరచుకున్నది అరుదు. చాలా కాలంపాటు ఆ శాఖ ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు. తాజాగా ఆ డిపార్ట్ మెంట్ ఎంప్లాయిస్ కు మళ్లీ సెలవులు వచ్చేశాయి. తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్స్ చట్టం తేబోతున్న తరుణంలో తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు రాష్ర్ట ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మంగళవారం నుంచి సెలవులు వర్తిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సెలవులు ప్రకటించింది. అయితే, స్టాంపుల కొనుగోలు, చలాన్లు చెల్లించిన వారికి ఇవాళ ఒక్కరోజు మాత్రం రిజిస్ట్రేషన్లు అవుతాయని రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ కమిషనర్ చిరంజీవులు ప్రకటించారు. కాగా, ఇవాళ్టి నుంచి స్టాంపుల విక్రయాలు పూర్తిగా నిలిపివేశామని ఆయన స్పష్టం చేశారు. ఫలితంగా మంగళవారం నుంచి పూర్తిగా రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయని పేర్కొన్నారు.