గణతంత్ర వేడుకలకు రాజధాని హస్తిన సర్వసన్నద్ధం, 25 వేల మంది సందర్శకులకు మాత్రమే అనుమతి, జోరుగా రిహార్సల్స్

జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. కరోనా నేపథ్యంలో భారీ ఎత్తున సందర్శకులకు అనుమతి లేకున్నా,..

  • Venkata Narayana
  • Publish Date - 11:01 am, Sun, 24 January 21
గణతంత్ర వేడుకలకు రాజధాని హస్తిన సర్వసన్నద్ధం, 25 వేల మంది సందర్శకులకు మాత్రమే అనుమతి, జోరుగా రిహార్సల్స్

జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. కరోనా నేపథ్యంలో భారీ ఎత్తున సందర్శకులకు అనుమతి లేకున్నా, కొత్త శకటాలు, ఆయుధాల ప్రదర్శనకు మాత్రం ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది లక్షా 50వేల మందిని ఈ వేడుకలు నేరుగా తిలకించేందుకు అనుమతివ్వగా, ఈ ఏడాది కేవలం 25 వేల మంది సందర్శకులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. గణతంత్ర వేడుకల్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలకు చూపించాలని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఫ్రాన్స్ నుంచి ఇండియా కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాలు తొలిసారిగా పరేడ్ లో భాగం కానున్నాయి. ఇక తొలి మహిళా ఫైటర్ విమానాల పైలెట్ భావనా కాంత్ ఈ ప్రదర్శనలో భాగం పంచుకోనున్నారు. పలు రకాల తేలికపాటి యుద్ధ విమానాలతో పాటు సుఖోయ్-30 జెట్లు కూడా కనువిందు చేయనున్నాయి. ఇక రిపబ్లిక్ వేడుకల్లో తొలిసారిగా లద్దాఖ్ భాగం కాబోతోంది. లేహ్ లో భాగమైన థిక్సే కొండలపై ఓ పర్యాటక కేంద్రంగా ఉన్న చారిత్రక మఠం నమూనా తొలిసారిగా ప్రదర్శితం కాబోతోంది. యూపీలో నిర్మితం కానున్న రామాలయం నమూనా, ఏపీకి సంబంధించి లేపాక్షీ థీమ్ తో శకటం ఈ సారి గణతంత్రవేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. అంతేకాదు, భారత నావికాదళం నుంచి 1971లో జరిగిన యుద్ధంలో పాల్గొన్న ఐఎన్ఎస్ విక్రాంత్ నమూనా శకటం కూడా ప్రదర్శనకు రానుంది. ఇప్పటికే ప్రదర్శనకు సంబంధించి ఆయా విభాగాలు జోరుగా రిహార్సల్స్  పూర్తి చేస్తున్నాయి.