AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాటేరమ్మ పెద్ద కొడుకు విధ్వంసం.. హైదరాబాద్ గడ్డపై సరికొత్త రికార్డుల వేట..!

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ చరిత్ర సృష్టించాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో మెరుపు అర్ధశతకంతో మెరిసిన క్లాసెన్, ఫ్రాంచైజీ తరపున అత్యధిక యాభైకి పైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరి తనదైన ముద్ర వేసుకున్నాడు. ఈ సీజన్‌లో అత్యంత నిలకడైన ఆటగాడిగా అతను ఎదురులేకుండా దూసుకుపోతున్నాడు.

కాటేరమ్మ పెద్ద కొడుకు విధ్వంసం.. హైదరాబాద్ గడ్డపై సరికొత్త రికార్డుల వేట..!
Heinrich Klaasen
Venkata Chari
|

Updated on: May 06, 2026 | 10:01 PM

Share

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 32 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్న ఈ దక్షిణాఫ్రికా వీరుడు, పంజాబ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. మొత్తం 43 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్ 69 పరుగులు సాధించాడు. ఇందులో 4 భారీ సిక్సర్లు, 3 బౌండరీలు ఉన్నాయి. ఇన్నింగ్స్ చివరి బంతికి అవుట్ అయినప్పటికీ, జట్టుకు భారీ స్కోరు అందించడంలో అతను కీలక పాత్ర పోషించాడు.

సన్‌రైజర్స్ దిగ్గజాల సరసన రికార్డు..

ఈ అర్ధశతకంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ చరిత్రలో క్లాసెన్ ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. హైదరాబాద్ తరపున అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్ వంటి దిగ్గజాల సరసన నిలిచాడు. ప్రస్తుతం క్లాసెన్ 14 అర్ధశతకాలతో అభిషేక్ శర్మతో కలిసి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

హైదరాబాద్ తరపున అత్యధిక 50+ పరుగులు చేసిన ప్లేయర్లు:

డేవిడ్ వార్నర్: 42

శిఖర్ ధావన్: 19

కేన్ విలియమ్సన్: 18

హెన్రిచ్ క్లాసెన్ / అభిషేక్ శర్మ: 14

2026 సీజన్‌లో అగ్రస్థానం..

ఈ ఏడాది ఐపీఎల్‌లో క్లాసెన్ భీభత్సం మామూలుగా లేదు. ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఐదు అర్ధశతకాలు బాదిన క్లాసెన్, ప్రస్తుత టోర్నీలో అత్యధిక యాభైలు చేసిన బ్యాటర్‌గా అగ్రస్థానంలో ఉన్నాడు. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు నాలుగు అర్ధశతకాలతో అతని వెంటే ఉన్నప్పటికీ, క్లాసెన్ తన నిలకడతో అందరికంటే ముందున్నాడు. మధ్య వరుసలో బ్యాటింగ్‌కు వచ్చి ఇంతటి వేగంతో పరుగులు సాధించడం అతడి ప్రత్యేకత.

భారీ స్కోరు దిశగా హైదరాబాద్..

మ్యాచ్ ఆరంభంలోనే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ 55 పరుగులతో జట్టుకు బలమైన పునాది వేశాడు. ఆ తర్వాత వచ్చిన క్లాసెన్ మైదానం నలుమూలలా షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివర్లో నితీష్ కుమార్ రెడ్డి మెరుపులు తోడవడంతో హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 235 పరుగుల భారీ స్కోరును సాధించింది. పంజాబ్ ఫీల్డర్ల వైఫల్యాలు మరియు క్లాసెన్ విధ్వంసం వెరసి హైదరాబాద్ గడ్డపై పరుగుల వరద పారింది.

Follow Us