కరోనా తీవ్రతకు ఇదే అసలు సమయంః రాష్ట్ర హెల్త్ డైరెక్టర్

అప్పుడే అయిపోలేదు. డేంజర్‌ టైమ్ ముందుంది. పార్టీలు, పండగలు, ఫంక్షన్‌లు ప్లాన్‌ చేసుకున్నారో మీ పని అంతే సంగతులంటున్నారు తెలంగాణ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు. రాష్ట్ర ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వింటర్‌ వార్నింగ్ ఇస్తున్నారు.

కరోనా తీవ్రతకు ఇదే అసలు సమయంః రాష్ట్ర హెల్త్ డైరెక్టర్

Updated on: Nov 03, 2020 | 8:39 PM

అప్పుడే అయిపోలేదు. డేంజర్‌ టైమ్ ముందుంది. పార్టీలు, పండగలు, ఫంక్షన్‌లు ప్లాన్‌ చేసుకున్నారో మీ పని అంతే సంగతులంటున్నారు తెలంగాణ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు. రాష్ట్ర ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వింటర్‌ వార్నింగ్ ఇస్తున్నారు. ఇంట్లోంచి బయటకొచ్చినా.. ధైర్యంగా వేరే ఊరు వెళ్లాలనుకున్నా… ప్రమాదం వైరస్‌ రూపంలో విరుచుకుపడుతుందని మర్చిపోవద్దు. ముఖ్యంగా ఈ సీజన్‌లో మగవాళ్లకైతే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందంటున్నారు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.

రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ, అసలు వైరస్ విజృంభించే సమయం ఇప్పుడే మొదలైంది. శీతాకాలం మూడు నెలల పాటు కరోనా వ్యాప్తికి ఇదే అనుకూల సమయమని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. వైరస్‌కి వాక్సిన్‌ వస్తుంది. వర్షాకాలం అయిపోయింది. ఏమైనా కరోనా లక్షణాలు కనిపిస్తే టాబ్లెట్లు, హోమ్‌ ఐసోలేషన్‌తో సరిపెట్టవచ్చని అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు వైరస్‌ సోకిన వ్యక్తుల్లో లక్షణాలు కూడా పెద్దగా కనిపించవని… ఒక కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి జనం మధ్యలోకి వస్తే నలుగురు, ఐదుగురు కరోనా బారిన పడతారని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరిస్తున్నారు.

రాబోయే మూడు నెలలు పెద్ద పండగలు ఉన్న నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచిస్తున్నారు. అలాగని ప్రయాణాలు , షాపింగ్‌ ప్లాన్ చేసుకుంటే డేంజర్‌లో పడటం ఖాయమని హెల్త్ డిపార్ట్‌మెంట్‌ హెచ్చరిస్తోంది. 90 రోజుల పాటు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్‌ బారిన పడతారంటోంది. ముఖ్యంగా రోడ్లపైకి వచ్చే మగవాళ్లకు ఈ సీజన్‌ మరింత ప్రమాదకరంటున్నారు. 70శాతం మగవాళ్లే కరోనా బారిన పడే ఛాన్సుందని అధికారులు చెబుతున్నారు. వైరస్ విజృంభించడానికి శీతాకాలం అనుకూలమైనది కావడం వల్ల సొంత వైద్యం పనికి రాదంటోంది ప్రభుత్వం. లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు. ప్రతిఒక్కరూ స్వీయనియంత్రణ, వ్యక్తిగత శుభ్రత, వ్యాధి నిరోధకశక్తి పెంచుకుంటేనే కరోనా మహమ్మారిని జయించడం సాధ్యపడుతుంది.