Hardik Pandya Trade: హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
2026 ఐపీఎల్ సీజన్ తర్వాత ముంబై ఇండియన్స్ నుండి హార్దిక్ పాండ్యా వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. అతడిని సొంతం చేసుకునేందుకు CSK, KKR, RR సహా ఏడు ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. కెప్టెన్సీ ఆఫర్‌లతో చర్చలు కొనసాగుతున్నాయి. నగదు లేదా ఆటగాళ్ల మార్పిడిపై స్పష్టత లేనప్పటికీ, ఐపీఎల్ ట్రేడ్ డీల్ క్లిష్టంగా మారడంతో చివరి నిమిషంలో కీలక మార్పులు చోటుచేసుకోవచ్చు.

2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో ఘోర నిరాశను ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్ (MI)లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జట్టు నుంచి వైదొలగాలని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నిర్ణయించుకున్నట్లు వార్తలు రావడంతో అతడిని సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 32 ఏళ్ల ఈ స్టార్ ఆల్‌రౌండర్‌ను దక్కించుకునేందుకు ఏకంగా ఏడు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. సమాచారం ప్రకారం.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మినహా మిగతా ప్రధాన ఫ్రాంచైజీలు పాండ్యా కోసం రంగంలోకి దిగాయి.
ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ పాండ్యా కోసం బలంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రారంభంలో ఆలస్యంగా స్పందించిన CSK ప్రస్తుతం పాండ్యా ట్రేడ్ విషయంలో బలమైన పోటీదారుగా మారినట్లు తెలుస్తోంది. ధోనీ తర్వాతి శకంలో జట్టును నడిపించగల నాయకత్వ లక్షణాలు ఉన్న ఆటగాడిగా పాండ్యాను CSK చూస్తున్నప్పటికీ, అతనికి కెప్టెన్సీ ఇస్తారనే హామీ లేదని తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం శాశ్వత కెప్టెన్ కోసం చూస్తున్న KKR, పాండ్యాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధంగా ఉందని సమాచారం. రాజస్థాన్ రాయల్స్ కూడా దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా కెప్టెన్సీతో కూడిన కీలక పాత్రను ఆఫర్ చేసేందుకు ఆసక్తి చూపుతోంది.
ప్రస్తుతం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నప్పటికీ, ఏ ఫ్రాంచైజీ కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ట్రేడ్ నగదు రూపంలోనే జరుగుతుందా? లేక ఆటగాళ్ల మార్పిడి ఉంటుందా? CSK ఎవరిని వదులుకుంటుంది? KKR వద్ద ట్రేడ్‌కు సరిపడే ఆటగాడు ఉన్నాడా? వంటి ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లేవు. గత సీజన్‌లో సంజు సామ్సన్, రవీంద్ర జడేజా, సామ్ కర్రన్‌ల మధ్య జరిగిన భారీ ట్రేడ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన అనుభవంతో CSK ఈసారి కూడా ఓపికగా పరిస్థితులను గమనిస్తూ సరైన సమయంలో అడుగులు వేస్తోందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఐపీఎల్ ట్రేడ్ విధానం క్లిష్టంగా ఉండటంతో చివరి నిమిషంలో మార్పులు చోటుచేసుకునే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
