ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో.? ప్రపంచంలో సగం మందికి ఇదే ఆందోళన.!

కరోనా కారణంగా చాలామంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అన్నీ కూడా మాములు స్థితికి చేరుకుంటున్నప్పటికీ.. ఇంకా ఉద్యోగుల్లో మాత్రం ఆందోళన తగ్గట్లేదు.

  • Ravi Kiran
  • Publish Date - 2:06 pm, Fri, 23 October 20
ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో.? ప్రపంచంలో సగం మందికి ఇదే ఆందోళన.!

Half Of Working Adults Worried About Jobs: కరోనా కారణంగా చాలామంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అన్నీ కూడా మాములు స్థితికి చేరుకుంటున్నప్పటికీ.. ఇంకా ఉద్యోగుల్లో మాత్రం ఆందోళన తగ్గట్లేదు. ఎక్కడ తమ ఉద్యోగాలు పొతాయన్న భయం వారిని వెంటాడుతోంది. భారతదేశంలో 57 శాతంతో సహా, రాబోయే 12 నెలల్లో ప్రపంచంలోని సగం మందికి పైగా ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కోల్పోతామని బెంగపడుతున్నారు. అయితే మూడింట రెండొంతుల మంది మాత్రం తమ యాజమాన్యాలు కొత్త ఉపాధి అవకాశాలు పొందటంతో సహకరిస్తాయని ఆశిస్తున్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరం 27 దేశాల్లో నిర్వహించిన సర్వే ద్వారా వెల్లడైంది.

ఆన్‌లైన్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ‘జాబ్స్ రీసెట్ సమ్మిట్’లో విడుదల చేసిన ఈ సర్వే పలు ఆసక్తికరమైన అంశాలను తెలియజేసింది, దీని ప్రకారం రష్యాలో ప్రతి నలుగురిలో ముగ్గురు ఉద్యోగులు ఉద్యోగ అభద్రతా భావంలో ఉండగా.. జర్మనీలో ఈ సంఖ్య ఒకటిగా ఉంది. నలుగురిలో ఒకరు మాత్రమే. భారతదేశంలో, దాదాపు 57 శాతం మంది తమ ఉద్యోగాల గురించి ఆందోళన చెందుతున్నారని ఈ సర్వే తెలిపింది. ఇక ప్రపంచవ్యాప్తంగా, రాబోయే 12 నెలల్లో 54 శాతం మంది తమ ఉద్యోగం ఉంటుందా.? ఊడుతుందా.? అనే అభద్రతా భావంలో ఉన్నారని పేర్కొంది.

ఉపాధి అవకాశాలపై ఆందోళనకు సంబంధించి రష్యా 75 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. స్పెయిన్ 73 శాతం, మలేషియా 71 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ లిస్టులో అత్యంత తక్కువగా జర్మనీ 26 శాతం.. స్వీడన్ 30 శాతం, నెథర్లాండ్స్, అమెరికా 36 శాతాలతో ఉన్నాయి. కాగా, ప్రపంచవ్యాప్తంగా 67 శాతం మంది ఉద్యోగులు తమ ప్రస్తుత యాజమాన్యం ద్వారా భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవచ్చని పేర్కొన్నారు. ఈ విషయంలో స్పెయిన్ (86 శాతం) అగ్రస్థానంలో ఉండగా, పెరూ (84 శాతం), మెక్సికో (83 శాతం)లు ఆ తర్వాత రెండు స్థానాల్లోనూ.. భారత్(80 శాతం), జపాన్ (45 శాతం), స్వీడన్ (46 శాతం), రష్యా (48 శాతం) ఆ వరుసలో ఉన్నాయి.