జీఎస్‌టీ చెల్లింపులపై జోక్యం చేసుకోండి.. మోదీని కేరళ సీఎం విజయన్

|

Sep 02, 2020 | 5:23 PM

చట్టబద్ధంగా రావల్సిన వస్తు, సేవల పన్ను పరిహారం చెల్లించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను ఆదేశించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కేరళ ముఖ్యమంత్రి పనరయి విజయన్ కోరారు.

జీఎస్‌టీ చెల్లింపులపై జోక్యం చేసుకోండి.. మోదీని కేరళ సీఎం విజయన్
Follow us on

జీఎస్‌టీ చెల్లింపులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చిచ్చు రేగుతోంది. తమ వాటాగా రావల్సిన నిధులను కేంద్ర జాప్యం చేస్తుందంటూ బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. మరోవైపు న్యాయపోరాటానికి సైతం సిద్ధపడుతున్నారు. తాజాగా చట్టబద్ధంగా రావల్సిన వస్తు, సేవల పన్ను పరిహారం చెల్లించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను ఆదేశించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కేరళ ముఖ్యమంత్రి పనరయి విజయన్ కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి ఓ లేఖ రాశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు రెండు అవకాశాలు ఇచ్చిందని, ఇవి కొంత భారాన్ని రాష్ట్రాలపై మోపుతున్నాయని, దీనిని ఉపసంహరించుకోవాలని కోరారు. జీఎస్‌టీ నష్ట పరిహారం భారాన్ని రాష్ట్రాలపై మోపాలనే ప్రయత్నాలలో జోక్యం చేసుకోవాలని మోదీని విజయన్ కోరారు. వస్తు, సేవల పన్ను (రాష్ట్రాలకు నష్ట పరిహారం) చట్టం, 2017 స్ఫూర్తిని అక్షరాలా పాటించాలని లేఖలో పేర్కొన్నారు. జీఎస్‌టీ రెవిన్యూలో జరిగిన నష్టంలో కొంత భాగం కోవిడ్-19 వల్ల ఏర్పడిందని, ఇది మునుపెన్నడూ లేనిదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్తుండటాన్ని తప్పుబట్టారు. రాష్ట్రాలకు ఇప్పటికే రెవిన్యూ నష్టం, వ్యయాల ఒత్తిళ్ళు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు ఇటువంటి కృత్రిమ వ్యత్యాసాలను పేర్కొనడం వల్ల ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర ఒత్తిళ్ళలో ఉన్న రాష్ట్రాలపై మరింత భారం పెరుగుతుందని విజయన్ లేఖలో పేర్కొన్నారు.