Ex MLA Enugu Ravinder Reddy: మాజీ మంత్రి ఈటలతో పాటు భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డికి సొంత జిల్లాలో ఘన స్వాగతం లభించింది. కామారెడ్డి జిల్లా సరిహద్దు బిక్కనూర్ మండలం బస్వాపుర్ చేరుకున్న ఏనుగు రవీందర్ రెడ్డికి భారీగా తరలి వచ్చిన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సుమారు 300 కార్లతో బీజేపీ నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ కొనసాగింది.
తెలంగాణలో మరో ఉద్యమం మొదలైందని.. సీఎం కేసీఆర్‌ను గద్దె దించడమే బీజేపీ లక్ష్యం అన్నారు ఏనుగు రవీందర్ రెడ్డి. అంతం మొదలైందని గ్రహించిన సీఎం కేసీఆర్ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఒక్కసారి ఓడిపోయినందుకు తనకు తన కార్యకర్తలకు సభ్యత్వాన్ని సీఎం కేసీఆర్ ఇవ్వలేదన్నారు. కేసీఆర్ చేసిన100 తప్పులను గ్రహించి ఈటల వెంట బీజేపీలో చేరానని రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. రానున్న 2023 ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందన ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని రవీందర్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇటీవల టీఆర్‌ఎస్‌కి గుడ్ బై చెప్పిన ఏనుగు రవీందర్ రెడ్డి సోమవారం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ బీజేపీ సభ్యత్వం ఇచ్చారు. ఆయనతో పాటు రమేష్ రాథోడ్, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, తెలంగాణ ఆర్టీసీ నేత అశ్వద్ధామ రెడ్డి బీజేపీలో చేరారు.