రెస్క్యూ ఆపరేషన్‌కు బ్రేక్.. చేతులెత్తేసిన సత్యం టీమ్..

| Edited By:

Oct 03, 2019 | 8:29 PM

పశ్చిమగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు వెలికితీత పనులు నిలిచిపోయాయి. బోటును వెలికితీయలేమని ధర్మాడి సత్యం టీం చేతులెత్తేసింది. మూడు రోజులుగా బోటును ఒడ్డుకు తెచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు. అయితే గోదావరి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడం, గోదావరిలో వరద ఉధృతి పెరగడంతో వెలికితీత పనులను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఎక్కడైతే బోటు మునిగిపోయిందో అదే ప్రాంతంలో సుడులు తిరుగుతున్నాయి. మళ్లీ బోటు తీసే క్రమంలో సుడులు ఏర్పడే అవకాశం ఉందని.. వరద ప్రవాహం కారణంగా […]

రెస్క్యూ ఆపరేషన్‌కు బ్రేక్.. చేతులెత్తేసిన సత్యం టీమ్..
Follow us on

పశ్చిమగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు వెలికితీత పనులు నిలిచిపోయాయి. బోటును వెలికితీయలేమని ధర్మాడి సత్యం టీం చేతులెత్తేసింది. మూడు రోజులుగా బోటును ఒడ్డుకు తెచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు. అయితే గోదావరి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడం, గోదావరిలో వరద ఉధృతి పెరగడంతో వెలికితీత పనులను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఎక్కడైతే బోటు మునిగిపోయిందో అదే ప్రాంతంలో సుడులు తిరుగుతున్నాయి.

మళ్లీ బోటు తీసే క్రమంలో సుడులు ఏర్పడే అవకాశం ఉందని.. వరద ప్రవాహం కారణంగా మరో ప్రమాదం జరగకూడదన్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు సత్యం టీమ్ చెబుతోంది. అయితే బోటు మునిగి సుమారు 20 రోజులు అవుతున్నా.. గల్లంతైన మృతదేహాల ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆశలు వదిలేసుకున్నారు. చివరి చూపుకు కూడా నోచుకోకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు.

సరిగ్గా 20 రోజుల క్రితం.. సెప్టెంబర్ 15 ఆదివారం రోజు 64 మంది పర్యాటకులు, 9 మంది సిబ్బందితో కలిపి మొత్తం 73 మందితో పోశమ్మ గుడి నుండి పాపికొండలు విహార యాత్రకు బయలుదేరిన రాయల్ వశిష్టా బోటు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కచ్చులూరు వద్ద సుడిగుండాలలో చిక్కుకుని గోదావరిలో మునిగిపోయింది. బోటులో ఉన్నవారు లైఫ్ జాకెట్‌లు వేసుకోకపోవడంతో ఎక్కువమంది గల్లంతయ్యారు. కాగా, 26 మందిని మత్సకారులు సురక్షితంగా కాపాడారు. దీనిపై వెంటనే స్పందించిన అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా ఎనిమిది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక 39 మంది గల్లంతైనట్లు అధికారులు అంచనా వేశారు.

ఇక సెప్టెంబర్ 16న ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బందితో పాటు నేవీ, ఓఎన్జీసీకి చెందిన హెలీకాఫ్టర్లతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. బోటును గుర్తించేందుకు ఉత్తరాఖండ్ నుండి ప్రత్యేక బృందం రప్పించి మరీ..
సైడ్ స్కాన్, సోనార్, ఇతర అధునాతన పరికరాలు ద్వారా గాలించారు. అదే రోజు సీఎం జగన్ ప్రమాద స్థలాన్ని హెలికాప్టర్ ద్వారా పరిశీలించి.. అనంతరం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిల్లో ఉన్న బాధితులను పరామర్శించారు. అధికారులతో బోటు పమాదం పై సమీక్షించిన సీఎం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు నష్టపరిహారం ప్రకటించారు.

ఇదిలా వుంటే సెప్టెంబర్ 17న గల్లంతైన వారిలో 20 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక గల్లంతైన వారిలో 19 మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది. రాయల్ వశిష్ట బోటు నీటిలో 300 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు. బోటును పైకి తీయడానికి వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో సాధ్యం కాలేదు. అయితే మిగిలిన మృతదేహాలు బోటులో చిక్కుకుపోయి ఉంటాయని అంచనాకు వచ్చారు. ప్రమాదానికి గురైన బోటులో దాదాపు 70 మంది ఉండొచ్చునని మంత్రి చెప్పగా.. ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథార్టీ ప్రమాదం జరిగిన బోటులో 60 మంది ప్రయాణిస్తున్నారని ఓ ప్రకటనలో తెలిపింది.

అయితే, ప్రమాద సమయంలో లాంచీలో మొత్తం 61 మంది ఉన్నట్లు స్థానికులు చెప్పారు. అందులో 50 మంది పర్యటకులు కాగా 11 మంది బోటు సిబ్బంది ఉన్నారని తెలిపారు. బోటు నిర్వాహకుడు వెంకట రమణ, మరి కొందరి పై అనుమానాలు లేకుండా గోదావరిలోకి పర్యటనకు తీసుకువెళ్లడం పై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. మరోవైపు గల్లంతైన వారి మృతదేహాలు లభ్యం కాకపోవడంతో.. మృతుల కుటుంబసభ్యులు ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బోటును తీయడం కష్ట సాధ్యం అని చెప్పడంతో కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం టీం కు బోటు వెలికితీత పనులను అప్పగించారు. అయితే, గత మూడు రోజులుగా ధర్మాడి సత్యం బృందం లంగర్ల సాయంతో బోటును వెలికితీసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేసింది. చివరికి పరిస్థితులు అనుకూలించకపోవడంతో బోటు వెలికితీత పనులను నిలిపివేశారు.