GHMC Election Results 2020 : టీఆర్ఎస్‌కు దక్కని పూర్తిస్థాయి మెజార్టీ.. మేయర్ పీఠంపై నెలకొన్న పీఠముడి.!
గ్రేటర్ దంగల్ ఫలితాల్లో ఏ పార్టీకి పూర్తిస్థాయిలో మెజార్టీ రాకపోవడంతో.. మేయర్ పీఠంపై పీఠముడి నెలకొంది. అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించినప్పటికీ...
గ్రేటర్ దంగల్ ఫలితాల్లో ఏ పార్టీకి పూర్తిస్థాయిలో మెజార్టీ రాకపోవడంతో.. మేయర్ పీఠంపై పీఠముడి నెలకొంది. అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించినప్పటికీ.., మ్యాజిక్ ఫిగర్‌కు చాలా దూరంగా ఉంది. ఈ క్రమంలోనే.. గ్రేటర్‌లో మేయర్ పీఠంపై పొత్తుల ఎత్తులు తెరపైకి వస్తున్నాయి. టీఆర్‌ఎస్ ఎక్స్ అఫీషియో ఓట్లతోనే మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందా…? లేదా.. ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటుందా అనేది ఉత్కంఠగా మారింది. అసలు.. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకోనున్నారు..? అనే విషయానికొస్తే, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన అధిక్యం లభించలేదు. మొత్తం 150 డివిజన్లు ఉన్న బల్దియాలో మేయర్ పీఠం కైవసం చేసుకోవాలంటే 76 స్థానాల్లో విజయం సాధించాలి. ఐతే.. గ్రేటర్ ఎన్నికల్లో 55 డివిజన్లు కైవసం చేసుకున్న టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఎంఐఎం 44 డివిజన్లు కైవసం చేసుకుంది. దీంతో గ్రేటర్ మేయర్ పీఠం దక్కడం ఎక్స్ అఫీషియో సభ్యులు కీలకం కానున్నారు. మొత్తం.. 52 మంది ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకుంటే మేయర్ ఎన్నికలో ఓటేసే వారి సంఖ్య 202కి చేరుతుంది. దీంతో మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 102 మేజిక్ ఫిగర్ అవసరం ఉంటుంది.
మొత్తం 52 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో… టీఆర్‌ఎస్‌కు అధికంగా 37 మంది, బీజేపీకి ముగ్గురు, కాంగ్రెస్‌కు ఒక్కరు, ఎంఐఎంకు 10 మంది ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీఆర్ఎస్ కూడా ఎక్స్ అఫీషియో కలుపుకున్నా… మేయర్ పీఠం దక్కించుకోవాలంటే మరో 10 మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆ పార్టీ ఎటువంటి ప్రయత్నాలు చేస్తుందనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో.. గ్రేటర్ పీఠం కోసం టీఆర్ఎస్, ఎంఐఎం పొత్తు పెట్టుకోవడమో.. లేక టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం బయటి నుంచి మద్దతు ఇచ్చే అవకాశం ఉండవచ్చు. అయితే… మేయర్ పీఠంపై.. టీఆర్‌ఎస్- ఎంఐఎం మధ్య ఎలాంటి పొత్తు ఒప్పందాలు నెలకొంటాయనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. మేయర్, డిప్యూటీ మేయర్.. ఎక్స్ అఫిషియో సభ్యుల ఓటు హక్కుపై.. గురువారం హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కును సవాల్ చేస్తూ.. బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పిటిషన్ వేశారు. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 90 ఆఫ్ 1ని కొట్టివేయాలని అనిల్ కుమార్ కోరారు. దీనిపై విచారించిన హైకోర్టు.. వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వం, ఎస్ఈసీ, జీహెచ్ఎంసీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల జనవరి 4కు వాయిదా వేసింది.