నేరేడ్‌మెట్ ఎన్నికల ఉత్కంఠకు తెర పడింది. జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ సందర్బంగా నిలచిపోయిన నెరేడ్‌మెట్ ఫలితంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఇతర ముద్రలతో ఉన్న 544 ఓట్లను లెక్కించాలని ఆదేశించింది. ఈనెల 4న లెక్కించకుండా మిగిలిపోయిన ఓట్లను పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. స్వస్తిక్ గుర్తుతో పాటు ఇతర గుర్తులను పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల కౌంటింగ్‌కు కొద్ది గంటల ముందు ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ.. బీజేపీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్వస్తిక్ గుర్తు ఉన్నవాటిని మాత్రమే పరిగణంలోకి తీసుకునేలా చూడాలని బీజేపీ నేతలు కోరారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన కోర్టు.. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు పూర్తి తీర్పును వెల్లడించింది.
టీఆర్ఎస్ అభ్యర్థి 504 ఓట్ల మెజారిటీలో ఉన్నప్పటికీ ఇతర ముద్రతో ఉన్న ఓట్లు 544 ఉన్నాయి. ఇతర ముద్రతో ఉన్న ఓట్లు మెజారిటీ కంటే ఎక్కువగా ఉండటంతో హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆ డివిజన్ ఫలితాన్ని ప్రకటించలేదు. ఆ అంశంపై ఈరోజు హైకోర్టులో పూర్తిస్థాయిలో వాదనలు కొనసాగాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం తన పరిధి దాటి ఉత్తర్వులను జారీ చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది దేశాయి ప్రకాశ్‌రెడ్డి వాదించారు.ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల నిర్వహణలో హైకోర్టు జోక్యం చేసుకోరాదని గతంలో సుప్రీంకోర్టు పేర్కొందని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఎన్నికల సంఘం తన పరిధికి లోబడే సర్క్యులర్ జారీ చేసిందని వివరణ ఇచ్చారు. ఓటరు తాను ఎవరికి ఓటు వేయాలనే స్పష్టత ఉన్నప్పుడు గుర్తు వివాదం కాదన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు.. బీజేపీ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఇతర ముద్రతో ఉన్న 544 ఓట్లు లెక్కించాలని స్పష్టం చేసింది. దీనిపై అభ్యంతరాలుంటే ఎన్నికల ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది.