Gautam Gambhir Slams : ఈ ఐపీఎల్ సీజన్‌లో వరుసగా విఫలమవుతున్న రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రాబిన్ ఊతప్పపై మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మండిపడ్డాడు. ఎన్నో అంచనాలతో జట్టులోకి తీసుకున్న ఊతప్ప ఏమి చేస్తున్నాడని విమర్శలు గుప్పించాడు. వచ్చామా.. వెళ్లామా అన్నట్లే ఊతప్ప బ్యాటింగ్ ఉందని గంభీర్ ధ్వజమెత్తాడు. అసలు ఊతప్ప నుంచి జట్టు యాజమాన్యం, జట్టు ఫ్యాన్స్ ఏమి ఆశించారో దాన్ని ఇప్పటివరకూ ఊతప్ప నిరూపించుకోలే పోయాడని అన్నారు. కనీసం మ్యాచ్‌లో ఊపును తీసుకొచ్చే యత్నం కూడా చేయడం లేకపోవడం సరికాదన్నారు.
అదే సమయంలో రియాన్ పరాగ్ కూడా సరిగా ఆకట్టుకోవడం లేదని… వారి ఆట ఇలానే ఉంటే రిజర్వ్ బెంచ్‌లో కూర్చొని మ్యాచ్‌లు చూసే పరిస్థితి వస్తుందన్నాడు. రాజస్థాన్ మేనేజ్‌మెంట్ అంచనాలను అందుకోవడానికి ఊతప్ప, పరాగ్‌లు ప్రయత్నించాల్సి అవసరం ఉందని సలహా ఇచ్చాడు. అయితే మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు అంచనాలను అందిపుచ్చుకోవడంలో విఫలమవడంతో గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఓటమి పాలైందన్నాడు. స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్, జోస్ బట్లర్‌ల పైనే రాజస్థాన్ ఎక్కువగా ఆధారపడతుండటమే వారి ఓటములకు కారణమని అంచనా వేశాడు.
ఇక రాజస్థాన్ జట్టుతో బెన్ స్టోక్స్ కలిశాడు కాబట్టి బ్యాటింగ్ కాంబినేషనల్ మార్పులు చూస్తున్నామని అన్నారు. స్టోక్స్ రావడంతో రాజస్థాన్ బలం పుంజుకుంటుందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. టాపార్డర్ బ్యాటింగ్‌లో లోటు స్టోక్స్ రాకతో తీరుతుందన్నాడు. జోస్ బట్లర్, స్మిత్, శాంసన్‌లు తొందరగా ఔటైన క్రమంలో మిడిల్ ఆర్డర్ చేతులెత్తేస్తుందని దీన్ని అధిగమిస్తే రాజస్థాన్‌కు తిరుగుండదని గంభీర్ పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో 3 కోట్ల రూపాయలకు ఊతప్పను రాజస్థాన్ కొనుగోలు చేసింది. కానీ ఇప్పటివరకూ దానికి ఊతప్ప న్యాయం చేయలేదు. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 17 పరుగులు, 2, 9, 5పరుగులు దారుణంగా విఫలమయ్యాడు.