సీఎం సీటుపై కూర్చునేది ఎప్పుడంటే? క్లారిటీ ఇచ్చిన కేటీఆర్

|

Jan 01, 2020 | 4:16 PM

తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై తానెప్పుడు కూర్చునే అంశంపై కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా మంగళవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2019 సంవత్సరాన్ని విజయవంతంగా ముగించిన టీఆర్ఎస్ పార్టీ త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లోను విజయదుందుబి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్. రాజకీయాల్లో ఎవరూ ఎవరికి శాశ్వత శత్రువులు కారంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈ మాట వర్తిస్తుందని చెప్పారు. ఎంఐఎం పార్టీతో కలిసి […]

సీఎం సీటుపై కూర్చునేది ఎప్పుడంటే? క్లారిటీ ఇచ్చిన కేటీఆర్
Follow us on

తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై తానెప్పుడు కూర్చునే అంశంపై కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా మంగళవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

2019 సంవత్సరాన్ని విజయవంతంగా ముగించిన టీఆర్ఎస్ పార్టీ త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లోను విజయదుందుబి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్. రాజకీయాల్లో ఎవరూ ఎవరికి శాశ్వత శత్రువులు కారంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈ మాట వర్తిస్తుందని చెప్పారు. ఎంఐఎం పార్టీతో కలిసి తామెప్పుడు పోటీ చేయలేదని, మునిసిపల్ ఎన్నికల్లోను ఎవరి దారి వారిదేనని చెప్పారు కేటీఆర్.

2020లో టీఆర్ఎస్ పార్టీ అన్ని జిల్లాల్లోను సొంత కార్యాలయాలను ప్రారంభించుకుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా చర్చ ముఖ్యమంత్రి పదవిపైకి మళ్ళడంతో కేటీఆర్ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. తనను కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం చేయడం తగదని ఆయనన్నారు. తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారని, ఇంకా తనను త్వరలో కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం చేయడం తగదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ప్రచారంలో వాస్తవం ఏ మాత్రం లేదని క్లారిటీ ఇచ్చారాయన.

మునిసిపల్ ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసేందుకు గ్రౌండ్ లెవల్ సర్వే చేయిస్తున్నామని, రెండ్రోజుల్లో ఆ నివేదికతో గులాబీ బాస్‌ని కలుస్తామని కేటీఆర్ వివరించారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి సమీక్షలో కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని ఆయన చెప్పారు. దానికి అనుగుణంగానే మునిసిపల్ ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేస్తామని తెలిపారు.

మునిసిపల్ ఎన్నికల్లో గెలిచిన ప్రతినిధులందరికీ పార్టీలతో ప్రమేయం లేకుండా శిక్షణ తరగతులు నిర్వహించి, కొత్త మునిసిపల్ చట్టంపై అవగాహన కల్పిస్తామని కేటీఆర్ ప్రకటించారు. అధికారులకు కూడా కొత్త చట్టంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల తరువాత రాబోయే నాలుగేళ్ళలో ఇక ఏరకమైన ఎన్నికలు లేవు కాబట్టి పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి పెడతామని అన్నారు కేటీఆర్.

ఎన్పీఆర్, ఎన్నార్సీల అమలుపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఫార్మాసిటీపై తాను ముంబయిలో జనవరి మూడో తేదీన జరగబోయే ఐపీఏ బోర్డు మీటింగ్‌లో తాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నామని, దాని తర్వాత ఫార్మాసిటీపై పూర్తి క్లారిటీ వస్తుందన్నారు కేటీఆర్. గోదావరి నీటిని కృష్ణానదిలోకి తరలించే విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు.