Alleges Molestation: బాబా ముసుగులో ఆగడాలు.. జైపూర్‌లో నలుగురు మహిళలపై లైంగిక దాడి

ఆధ్యాత్మిక జీవితం గడిపేందుకు వచ్చిన మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. స్వయం ప్రకటిత బాబా ఒకరు తన ఆశ్రమంలో నలుగురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Alleges Molestation: బాబా ముసుగులో ఆగడాలు.. జైపూర్‌లో నలుగురు మహిళలపై లైంగిక దాడి
Follow us
Balaraju Goud

|

Updated on: May 06, 2021 | 8:44 PM

Alleges Molestation: ఆధ్యాత్మిక జీవితం గడిపేందుకు వచ్చిన మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. స్వయం ప్రకటిత బాబా ఒకరు తన ఆశ్రమంలో నలుగురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాబా బారి నుంచి తప్పించుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాబా ఆకృత్యాలు బయటపడ్డాయి.

రాజస్థాన్‌లోని జైపూర్‌లో బాబా ఒకరు తన ఆశ్రమంలో నలుగురు మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టిన వైనం వెలుగులోకి వచ్చింది. ఇందులో ముగ్గురు మహిళలు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం మరింత కలకలం రేపింది. తపస్వి ఆశ్రమంలో సత్సంగంలో పాల్గొనేందుకు వెళ్లిన తమపై బాబా శైలేంద్ర మెహతా లైంగిక దాడికి పాల్పడినట్టు బాధితులు ఫిర్యాదు చేశారని భంక్రోటా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముకేశ్ చౌదరి పేర్కొన్నారు.

‘‘చాలా ఏళ్లుగా తమ కుటుంబ సభ్యులతో కలిసి తపస్వి ఆశ్రమానికి వెళ్తున్నట్టు బాధితులు వెల్లడించారు. సేవల పేరుతో ఆ మహిళలు రెండు రోజుల పాటు ఆశ్రమంలోనే ఉండేవారు. అదే సమయంలో నిందితుడు వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు’’ అని ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు మంగళవారం ఫిర్యాదు చేయగా.. మరో బాధితురాలు బుధవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు.

బాధితుల్లో ఒకరు తన కుమార్తెను ఆశ్రమానికి తీసుకెళ్లొద్దంటూ తన భర్తకు అడ్డుపడడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ‘‘ఆమె తనకు జరిగిన దారుణాన్ని చెప్పడంతో… అదే కుటుంబానికి చెందిన మరో ఇద్దరు మహిళలు కూడా ధైర్యం చేసి నిందితుడి దురాగతాన్ని బయటపెట్టారు. దీంతో ఆ కుటుంబం మొత్తం నిందితుడిపై కేసుపెట్టేందుకు ముందుకొచ్చింది’’ అని ఎస్‌హెచ్‌వో వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోందనీ… ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం పంపించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

Read Also…  పెళ్లి ప్రపోజల్ తిరస్కరించినందుకు బ్రిటిష్ యువతిని కాల్చి చంపారు, పాకిస్తాన్ లో దారుణం