
టిక్‌టాక్ ఈ మధ్య కొందరికి వ్యసనంలా మారిపోయింది. ముఖ్యంగా టీనేజర్లు దీని మాయలో పడి ఫ్యూచర్ పాడు చేసుకుంటున్నారు. దీనిలో లైకుల, షేర్ల కోసం యువత ప్రాణాలకు తెగిస్తున్నారు. దీంతో వినోదం పంచాల్సిన ఈ ఎంటర్టైన్మెంట్ యాప్..విషాదాలను మిగులుస్తుంది. తాజాగా నీటిలో దిగి టిక్‌టాక్ చేద్దామని ప్రయత్నించి ఐదుగురు టీనేజర్లు ప్రాణాలు విడిచిన విషాద ఘటన యూపీలోని వారణాసిలో చోటుచేసుకుంది. టిక్‌టాక్ చేసేందుకుగానూ ఆరుగురు మిత్రులు వారణాసిలోని గంగనది వద్దకు వెళ్లారు. వారిలో ఐదుగురు నీటిలో దిగగా.. ఒకరు ఒడ్డున ఉండి సెల్‌ఫోన్‌లో వీడియో రికార్డు చేస్తున్నాడు. నీటిలో దిగిన వ్యక్తుల్లో ఒకరికి.. నది లోతు అవగాహన లేకపోవడంతో వెనక్కి వెళ్లి మునిగిపోయాడు. అతడిని కాపాడానికి వెళ్లిన మిగిలిన నలుగురు ఫ్రెండ్స్ కూడా నీటి ప్రవాహంలో మునిగిపోయారు. ఒడ్డున ఉన్న స్నేహితుడు కేకలు వేయడంతో..చుట్టుపక్కల ఉన్న స్థానికులు వచ్చి చూసేసరికే ఐదుగురు కనిపించకుండా పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు…అక్కడికి వచ్చి ఘటన తీరుతెన్నులను పరిశీలించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి.. నీటమునిగి ప్రాణాలు విడిచిన ఐదుగురి మృతదేహాలను వెలికితీయించారు. వారిని ఫదీన్, సైఫ్, తౌసిఫ్, రిజ్వాన్, సకీగా గుర్తించారు. వారందరూ 14 నుంచి 19 ఏళ్లలోపు టీనేజర్స్ అని పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామ్‌నగర్‌లోని లాల్ బహదూర్ శాస్త్రి హాస్పిటల్ కు తరలించారు.