FasTag Free: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. జాతీయ రహదారుల్లో ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపులను పెంచే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఫాస్టాగ్‌ను 15 రోజుల పాటు ఉచితంగా పొందవచ్చునని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఫిబ్రవరి 15 నుంచి 29 వరకు ఎన్‌హెచ్‌ఏఐ ఫాస్టాగ్ కోసం చెల్లించాల్సిన రూ.100 రుసుమును మాఫీ చేస్తున్నట్లు వెల్లడించింది.(Chennai Hotel Goes Viral)
ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, సేవా కేంద్రాలు, పెట్రోలు బంకులు వంటి ప్రదేశాల్లో వాహన ధృవీకరణ పత్రం చూపించి ఉచితంగా ఫాస్టాగ్‌ను పొందవచ్చని స్పష్టం చేసింది. అంతేకాక ఈ ఫాస్టాగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్లు పెరిగాయని.. ప్రతీ రోజూ సుమారు రూ.87 కోట్ల ఆదాయం వస్తోందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. కాగా, ఈ విధానం పూర్తిస్థాయిలో ఆచరణలోకి వస్తే తప్పకుండా రోజూవారీ ఆదాయం రూ.100 కోట్లు దాటే అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.