విపక్షాలకు ఈసీ షాక్ ఇచ్చింది. రేపు జరగబోయే లోక్‌సభ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండదని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఈవీఎంలను లెక్కించడానికి ముందే వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని విపక్షాలు ఈసీని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రణాళిక ప్రకారమే ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్, ఆ తర్వాత ఈవీఎంలు, చివరగా వీవీప్యాట్లను లెక్కించనున్నారు. వీవీప్యాట్ల ఎంపిక లాటరీ పద్ధతిలో జరుగుతుంది.
కాగా, తమ డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తామని ఈసీ హామీ ఇచ్చిందని ప్రతిపక్ష నేతలు గుర్తుచేశారు. ఈసీ వాడుతున్న పదజాలం సానుకూలంగా లేదన్న విషయం తమకు అర్థమైందని వారన్నారు. అటు తమకు ఓటమి తప్పదన్న భయంతోనే విపక్షాలు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చాయని.. వారి ప్రయత్నాలు వృథా అని బీజేపీ వ్యాఖ్యానించింది.