INS Nipun: భారత నౌకాదళంలోకి మరో స్వదేశీ శక్తి.. ఆగస్ట్ 31న నేవిలో చేరనున్న ఐఎన్‌ఎస్ నిపుణ్!
భారత నౌకాదళంలోకి మరో స్వదేశీ శక్తి అడుగు పెట్టనుంది. ఆగస్టు 31న రెండో స్వదేశీ డైవింగ్ సహాయక నౌక నిపుణ్ నేవిలోకి చేరనుంది. విశాఖపట్నం హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఈ నౌక, లోతైన సముద్రంలో డైవింగ్, నీటి అడుగున పనులు, ప్రమాదంలో ఉన్న జలాంతర్గాములను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆధునిక పరికరాలతో నిపుణ్, సముద్ర కార్యకలాపాలను మరింత సురక్షితంగా, వేగంగా నిర్వహించేందుకు సహాయపడుతుంది.

సముద్రం అడుగున జరిగే ఆపరేషన్లలో భారత నౌకాదళం మరింత బలపడుతోంది. రెండో స్వదేశీ డైవింగ్ సహాయక నౌక ‘నిపుణ్’ ఆగస్టు 31న ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో నౌకాదళంలో చేరనుంది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ స్వదేశీ టెక్నాలజీతో నిర్మించిన ఈ నౌక.. లోతైన సముద్రంలో డైవింగ్ చేయడం, నీటి అడుగున ప్రత్యేక పనులు చేయడం, ప్రమాదంలో ఉన్న జలాంతర్గాములను రక్షించడం వంటి కీలక ఆపరేషన్లలో ఉపయోగపడనుంది.
సముద్రం ఎంత లోతులో ఉన్నా డైవర్లు సురక్షితంగా పనిచేసేందుకు అవసరమైన ఆధునిక పరికరాలు నిపుణ్‌లో ఉన్నాయి. డైవర్లకు నిరంతరం సహాయం అందించడంతో పాటు.. నీటి అడుగున ఏదైనా వస్తువును పరిశీలించడం, అవసరమైన పనులు చేయడం, అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం అందించడం వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. సముద్రంలో నౌక తన స్థానాన్ని కచ్చితంగా గుర్తించుకుని అక్కడే స్థిరంగా ఉండేలా ప్రత్యేక వ్యవస్థను కూడా ఇందులో ఏర్పాటు చేశారు.
అన్ని పరికరాల ఏర్పాటు, పరీక్షలు పూర్తయిన తర్వాత నిపుణ్‌ను జూలై 30న భారత నౌకాదళానికి అప్పగించారు. ఇప్పుడు నౌకాదళంలో చేరడంతో.. భారత సముద్ర జలాల్లో నీటి అడుగున చేపట్టే ప్రత్యేక ఆపరేషన్లు మరింత వేగంగా, సురక్షితంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రమాదానికి గురైన జలాంతర్గాములను గుర్తించడం, వాటి దగ్గరకు వెళ్లి రక్షణ చర్యలు చేపట్టడంలో నిపుణ్ కీలకంగా మారనుంది.
నిపుణ్ చిహ్నం కూడా ఈ నౌక ప్రత్యేకతను చెబుతోంది. అందులో కనిపించే తిమింగలం లోతైన సముద్రంలో ఎక్కువసేపు ఉండగల శక్తి, ఓర్పుకు ప్రతీకగా ఏర్పాటు చేశారు. ఇక డైవింగ్ హెల్మెట్ సముద్రంలోకి వెళ్లి పనిచేసే డైవర్లను, వారి భద్రత కోసం ఉన్న ప్రత్యేక పరికరాలను సూచిస్తుంది. అంటే.. సముద్రపు అగాధాల్లోకి డైవర్లను సురక్షితంగా తీసుకెళ్లి, క్లిష్టమైన పనులను పూర్తి చేయడంలో నిపుణ్ ఒక కీలకమైన సహాయక నౌకగా పనిచేయనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
