
చపాతీల గొడవతో ఓ డాబా యజమానిని కాల్చేశాడో వ్యక్తి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో గురువారం జరిగింది. వివరాల్లోకెళితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమిత్ చౌహన్, కసుస్తాబ్ సింగ్ అనే ఇద్దరు యువకులు గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఓ డాబాకు వెళ్ళారు. అందులో చపాతీలను ఆర్డర్ చేశారు. రాత్రి సమయంలో డాబా మూసివేయడానికి సిద్దంగా ఉందని.. మిగిలి ఉన్న చపాతీలను ఆ డాబా యజమాని వారికి ఇచ్చాడు. దీంతో చల్లని చపాతీలు ఇస్తావా అంటూ అతనితో గొడవకు దిగారు. ఈ క్రమంలో వారి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కసుస్తాబ్ సింగ్ తన జేబులో వెంటతెచ్చుకున్న తుపాకి తీసి డాబా యజమానిపై కాల్పులు జరిపాడు. బుల్లెట్ అతడి తొడలోకి వెళ్ళింది. వెంటనే స్థానికులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్లు చికిత్స చేసి బుల్లెట్‌ను బయటకు తీశారు. ప్రస్తుతం డాబా యజమాని ప్రాణాపాయం నుంచి తప్పించుకొని చికిత్స తీసుకుంటున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.