AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవశయని ఏకాదశి ఎప్పుడు..? ఈ రోజు తులసి పూజ ఎందుకు అత్యంత విశేషం? ఇలా పూజిస్తే విష్ణు-లక్ష్మీ కటాక్షం ఖాయం!

Devshayani Ekadashi 2026 Date: 2026 జూలై 25న దేవశయని ఏకాదశి సందర్భంగా తులసి పూజకు ఎందుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది? ఈ రోజున తులసిని ఎలా పూజించాలి, చాతుర్మాసం ఎందుకు ప్రారంభమవుతుంది, విష్ణు-లక్ష్మీ అనుగ్రహం పొందాలంటే ఏ నియమాలు పాటించాలో తెలుసుకోండి.

దేవశయని ఏకాదశి ఎప్పుడు..? ఈ రోజు తులసి పూజ ఎందుకు అత్యంత విశేషం? ఇలా పూజిస్తే విష్ణు-లక్ష్మీ కటాక్షం ఖాయం!
Devshayani Ekadashi 2026 Telugu
Rajashekher G
|

Updated on: Jul 22, 2026 | 3:00 PM

Share

Tulsi Puja on Ekadashi: హిందూ సంప్రదాయంలో ఏకాదశి ఉపవాసానికి ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. అయితే ఆషాఢ శుక్ల పక్షంలో వచ్చే దేవశయని ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం, ఈ రోజు నుంచి శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో నాలుగు నెలల పాటు యోగనిద్రలోకి ప్రవేశిస్తారు. దీంతో చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా తులసి పూజ చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఈ ఏడాది దేవశయని ఏకాదశి (Devshayani Ekadashi) ఎప్పుడు? తులసి పూజకు ఎందుకు అంతటి విశిష్టత ఉందో తెలుసుకుందాం.

దేవశయని ఏకాదశి 2026 ఎప్పుడు?

దృక్ పంచాంగం ప్రకారం, 2026 జూలై 25, శనివారం దేవశయని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఆషాఢ మాసం శుక్ల పక్షంలోని ఈ ఏకాదశిని “హరి శయని ఏకాదశి” అని కూడా పిలుస్తారు. మత విశ్వాసాల ప్రకారం, ఈ రోజు నుంచి శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాతి నాలుగు నెలల కాలాన్నే ‘చాతుర్మాసం’ అంటారు. ఈ సమయంలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలను సాధారణంగా నిర్వహించరు. అనంతరం ప్రబోధిని (దేవుత్థాన) ఏకాదశి నాడు విష్ణుమూర్తి మేల్కొంటారని, అప్పటి నుంచి తిరిగి శుభకార్యాలు ప్రారంభమవుతాయని విశ్వసిస్తారు.

దేవశయని ఏకాదశి రోజున తులసి పూజ ఎందుకు ప్రత్యేకం?

తులసి దేవిని లక్ష్మీదేవి స్వరూపంగా, శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనదిగా శాస్త్రాలు పేర్కొంటాయి. అందుకే విష్ణు ఆరాధనలో తులసికి అత్యంత కీలక స్థానం ఉంది. దేవశయని ఏకాదశి రోజున తులసి పూజ చేస్తే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆర్థికాభివృద్ధి కలుగుతాయని కూడా నమ్ముతారు.

తులసి పూజ ఎలా చేయాలి?

దేవశయని ఏకాదశి రోజున ఈ విధంగా పూజ చేయడం శుభప్రదంగా భావిస్తారు.

  • ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి.
  • ముందుగా ఇంటి పూజామందిరంలో శ్రీమహావిష్ణువును పూజించాలి.
  • తులసి మొక్క చుట్టూ ప్రదేశాన్ని శుభ్రం చేసి, నీరు సమర్పించాలి.
  • తులసి మాత ముందు దీపం వెలిగించి, పుష్పాలు సమర్పించాలి.
  • “ఓం నమో నారాయణాయ” లేదా విష్ణు మంత్రాలను జపిస్తూ ప్రార్థించాలి.
  • విష్ణుమూర్తికి తులసి దళాలను సమర్పించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు.
  • కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం ప్రార్థించాలి.

తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల కలిగే ఫలితాలు

సాయంత్రం తులసి మొక్క వద్ద నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించడం కూడా విశేష ఫలితాలను ఇస్తుందని విశ్వాసం. మతపరమైన నమ్మకాల ప్రకారం.. ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగుతాయి. సానుకూల శక్తి పెరుగుతుంది. లక్ష్మీ కటాక్షం లభిస్తుందని విశ్వసిస్తారు. కుటుంబంలో శాంతి, సుఖసంతోషాలు నెలకొంటాయని చెబుతారు.

చాతుర్మాసం ప్రారంభం

దేవశయని ఏకాదశితో చాతుర్మాసం ఆరంభమవుతుంది. ఈ నాలుగు నెలలను ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రమైన కాలంగా భావిస్తారు. ఈ సమయంలో భక్తులు ఉపవాసాలు, జపాలు, దానధర్మాలు, పూజలు, భజనలు వంటి ధార్మిక కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. చాతుర్మాసంలో శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం మాసాలు వస్తాయి. ఈ కాలంలో శ్రీమహావిష్ణువు, పరమశివుడు, లక్ష్మీదేవి తదితర దేవతల ఆరాధనకు విశేష ప్రాధాన్యం ఉంటుంది.

(Disclaimer: ఈ కథనం పురాణాలు, మత విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా రూపొందించబడింది. వీటిని విశ్వసించడం పూర్తిగా వ్యక్తిగత భక్తి, విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us