
ఆఫ్ఘనిస్తాన్‌లో బాంబుల మోత కొనసాగుతోంది. రాజధాని కాబూల్ మరోసారి దద్దరిల్లింది. మంగళవారం ఉదయం నగరంలోని మాక్రోరాయన్ ప్రాంతంలో కాబూల్ డిప్యూటీ గవర్నర్ మోహిబుల్లా మొహమ్మది ప్రయాణిస్తున్న కారు లక్ష్యంగా శక్తివంతమైన బాంబు పేలింది. ఈ ఘటనలో మొహమ్మదితో పాటు మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఆయనతో ప్రయాణిస్తున్న ఇద్దరు అంగ రక్షకులు తీవ్రగాయాలపాలయ్యారు..
కాబూల్ నగరంలో ఉగ్రవాదులు మరో దారుణానికి కూడా పాల్పడ్డారు. పోలీసులు లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ అధికారి మరణించారు. ఓ పోలీసు సిబ్బంది గాయపడ్డారని కాబూల్ పోలీసు చీఫ్ ప్రతినిధి ఫెర్డాస్ ఫరామార్జ్ తెలిపారు. ఈ రెండు ఘటనలతపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన అన్నారు.
ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌లో జరిగిన ఈ రెండు ఘటనలకు ఇప్పటి వరకూ ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత స్వీకరించలేదు. అయితే ఈ దాడుల వెనుక ఇస్లామిక్ స్టేట్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు. గత కొద్ది నెలలుగా ఐసిస్ దాడుల్లో సుమారు 50 మంది మరణించారు. తాలిబన్లకు, ఆప్ఘన్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న శాంతి చర్చల నేపథ్యంలో ఉగ్రవాదులు మరింత రెచ్చిపోయి మారణకాండ సృష్టిస్తున్నారు.