బంగాళాఖాతంలో మరో తీవ్ర అల్పపీడనం.. సాయంత్రంకల్లా వాయుగుండంగా మారే అవకాశం.. మరోవైపు పంజా విసురుతున్న చలి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడి సోమవారం సాయంత్రంకల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

బంగాళాఖాతంలో మరో తీవ్ర అల్పపీడనం.. సాయంత్రంకల్లా వాయుగుండంగా మారే అవకాశం.. మరోవైపు పంజా విసురుతున్న చలి
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 30, 2020 | 6:39 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడి సోమవారం సాయంత్రంకల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. డిసెంబరు 2న దక్షిణ తమిళనాడు తీరాన్ని చేరే అవకాశమున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అలాగే, రాష్ట్రం లో మూడు రోజులు పొడి వాతావరణం ఉంటుందన్నారు.

మరోవైపు, చలి పంజా విసురుతోంది. ఉత్తర భారతం వణుకుతోంది. ఇప్పటికే కరోనాతో అల్లాడుతున్న హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో టెంపరేచర్‌ పడిపోయింది. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జనం కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారు. వింటర్‌ సీజన్‌లో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రానున్న మూడు నెలల్లో శీతల గాలులతో ఉత్తర, మధ్య భారతం వణికిపోయే అవకాశాలున్నాయని వెల్లడించింది.

డిసెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు శీతాకాల ఉష్ణోగ్రతలను అంచనా వేసిన వాతావరణ శాఖ….. వచ్చే మూడు నెలల్లో ఉత్తర, మధ్య భారత్‌లో సాధారణం కంటె తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఈ సీజన్‌లో ఉత్తర భారత్‌ అతి శీతలంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగానూ, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అతి తక్కువగా ఉంటాయని ఐఎండీ చీఫ్‌‌ మృత్యుంజ‌య్‌ మహోపాత్ర వెల్లడించారు.

కాగా, ఇటు తెలంగానలోనూ అత్యల్ప ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజన్సీ ప్రాంతాలు చలితో వణికిపోతున్నాయి. ఈ ఉదయం నిర్మల్‌లో 15.9 డిగ్రీలు, రాజన్న సిరిసిల్లలో 16.2, ఆదిలాబాద్‌లో 16.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.