ప్రపంచమంతా అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే.. మనదేశంలో కొంతమంది ప్రజలు మాత్రం ఇంకా మూఢ నమ్మకాలు, కుల, మత పట్టింపులతో మానవత్వాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇందుకు నిదర్శనమైన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. విందులో వడ్డించే ఆహారాన్ని ముట్టుకున్నాడనే కారణంతో ఓ దళిత వ్యక్తిని అత్యంత దారుణంగా కొట్టి చంపారు. వివరాల్లోకెళితే.. మధ్యప్రదేశ్‌లో చత్తర్‌పూర్ జిల్లాలోని కిషన్‌పూర్ గ్రామంలో ఒకరి ఇంట్లో శుభకార్యం జరుగుతోంది. శుభకార్యం అనంతరం శుభ్రం చేసేందుకోసం దేవ్‌రాజ్ అనురాగిని పనిలో పెట్టుకున్నారు. అయితే అనురాగికి ఆకలేయడంతో అక్కడ ఉన్న ఆహార పదార్థాలను పెట్టుకుని తిన్నాడు. ఇది గమనించిన అగ్రకులానికి చెందిన ఇద్దరు యువకులు అనురాగిని కులం పేరుతో దూషిస్తూ విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అనురాగీ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. దీంతో నిందితులైన భూరా సోని, సంతోస్ పాల్ అక్కడి నుండి పారిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారైన నిందితుల కోసం గాలిస్తున్నారు.