రైతు చట్టాలపై ప్రభుత్వ చర్చల మీద నమ్మకం లేదు, సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి, తొందరపడ్డారని విమర్శ
రైతు చట్టాలపై అన్నదాతలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చలమీద తమకు విశ్వాసం లేదని సీపీఐ ఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి అన్నారు.
రైతు చట్టాలపై అన్నదాతలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చలమీద తమకు విశ్వాసం లేదని సీపీఐ ఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి అన్నారు. ఈ చట్టాలకు సంబంధించిన బిల్లులను పార్లమెంటులో హడావుడిగా ఎందుకు ఆమోదించారని ఆయన ప్రశ్నించారు. రైతు సమస్యలపై ఏ సమయంలోనైనా అరమరికలు లేకుండా ఓపెన్ మైండ్ తో చర్చలకు ప్రభుత్వం సిధ్ధంగా ఉందని ప్రధాని మోదీ నిన్న ప్రకటించారని, మరి ఈ పని అప్పుడే ఎందుకు చేయలేదన్నారు. పార్లమెంటులో ఈ బిల్లులమీద చర్చను బీజేపీ అడ్డుకోలేదా ? వీటిపై చర్చ జరగాలని పట్టు బట్టిన ఎంపీలను సస్పెండ్ చేయలేదా ? ఓపెన్ మైండ్ తో మీరెందుకు రైతులతో ముందే ఎందుకు చర్చలు జరపలేదు అని సీతారాం ఏచూరి ప్రశ్నలు సంధించారు. బిల్లులను హడావుడిగా ఆమోదించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ఇప్పుడేమో ఈ అంశాలపై చర్చలకు సిధ్ధమంటున్నారు..మరి అలాంటప్పుడు ఈ చర్చలపై ఎవరికైనా నమ్మకం ఎలా ఉంటుందన్నారు.
రైతు చట్టాలపై ఓ తీర్మానాన్ని ఆమోదించేందుకు ప్రత్యేక అసెంబ్లీని సమావేశపరచాలని కేరళ ప్రభుత్వం కోరితే గవర్నర్ తిరస్కరించారని ఏచూరి గుర్తు చేశారు. ఆ రాష్ట్రంలో ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ పెద్ద నిరసన ప్రదర్శన జరిగిన విషయం పత్రికల్లో ప్రధాన వార్తలుగా వచ్చిన విషయాన్ని మోదీ పట్టించుకోలేదన్నారు. గుడ్ గవర్నెన్స్ అని పదేపదే వల్లె వేస్తుంటారని, అంటే ఇదేనా అని సీతారాం ఏచూరి ప్రశ్నించారు.