Telangana Coronavirus today updates: తెలంగాణలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,11,947 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 623 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,43,716కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ముగ్గురు బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,796కి చేరింది. ఇక, ఒక్కరోజు వ్యవధిలో 746 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,30,732కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,188 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 97.98 శాతంగా నమోదైందని రాష్ట్ర వైద్యా ఆరోగ్య విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.
అటు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో… పాజిటివ్ కేసుల పెరుగుదల టెన్షన్ ను పెంచుతోంది.
కాగా, ఇదే అంశానికి సంబంధించి హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. గత రెండు వారాలుగా గాంధీ ఆసుపత్రిలో కరోనా సివియారిటీ కేసుల సంఖ్య పెరుగుతోందని రాజరావు చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న సమయంలోనే మళ్లీ కేసులు పెరుగుతుడటం ఆందోళన కలిగిస్తోందన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయితే, థర్డ్ వేవ్ పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగానే ఉన్నారని స్పష్టం చేశారు.
ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో 400 మంది వరకు కరోనా చికిత్స పొందుతున్నారు. ఆగస్ట్ 3 నుంచి గాంధీలో నాన్ కోవిడ్ సేవలను ప్రారంభించాలనే విషయంపై ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నాన్ కోవిడ్ సేవలను ప్రారంభించడం రిస్క్ తో కూడుకున్న వ్యవహారమే అన్నారు రాజారావు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.
Read Also..