కాంగ్రెస్ లో మళ్ళీ ‘అసమ్మతి పర్వం’ ? 19 న సోనియా గాంధీతో ‘అసంతృప్తుల’ భేటీ ! కమల్ నాథ్ సారథ్యం?

| Edited By: Pardhasaradhi Peri

Dec 17, 2020 | 7:55 PM

కాంగ్రెస్  పార్టీలో మళ్ళీ అసమ్మతి పర్వం మొదలవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. నాయకత్వ మార్పు జరగాలని, సంస్థాగత ఎన్నికలను నిర్వహించాలని..ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతూ గతంలో..

కాంగ్రెస్ లో మళ్ళీ అసమ్మతి పర్వం ? 19 న సోనియా గాంధీతో అసంతృప్తుల భేటీ ! కమల్ నాథ్ సారథ్యం?
Follow us on

కాంగ్రెస్  పార్టీలో మళ్ళీ అసమ్మతి పర్వం మొదలవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. నాయకత్వ మార్పు జరగాలని, సంస్థాగత ఎన్నికలను నిర్వహించాలని..ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతూ గతంలో ఏకంగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది అసమ్మతివాదులు శనివారం ఆమెతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం., సీనియర్ నేత కమల్ నాథ్ ఆధ్వర్యంలో వీరు ఆమెతో భేటీ కానున్నారని సమాచారం. ఈ మీటింగ్ లో వీరంతా రాజీకి వస్తారా లేక మళ్ళీ అసమ్మతి గళాలు విప్పుతారా అన్నది తేలాల్సి ఉంది. అయితే పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ సమావేశంలో పాల్గొంటారా లేదా అన్నది తెలియలేదు. గత ఆగస్టులో లేఖ రాసినవారే కాక, ఇతర మధ్యస్థ నేతలు కూడా ఈ సమావేశానికి హాజరవుతారని పార్టీలో ఓ వర్గం అంటోంది. నాడు అసమ్మతివాదుల డిమాండును  తెరవెనుక నుంచి సమర్థించిన కమల్ నాథ్.. ఆ తరువాత… లేఖ రాసిన నాయకులతో సమావేశం కావాలని గాంధీ కుటుంబానికి నచ్ఛజెప్పారట !

కానీ ఇప్పటివరకు ఆయన వారితో దూరాన్ని మెయిన్ టెయిన్ చేస్తూనే ఉన్నారు. నాడు ‘లెటర్ బాంబ్’ఎపిసోడ్ అనంతరం గులాం నబీ ఆజాద్ వంటి డిసిడెంట్ల పట్ల సోనియా ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలిసిందే.. రాజ్యసభలో ఆజాద్ ప్రాముఖ్యాన్ని ఆమె తగ్గించేశారు. ఆన్ లైన్ కాంగ్రెస్ మీట్ లో ముకుల్ వాస్నిక్ కి కూడా చేదు అనుభవమే మిగిలింది. నూతన సంవత్సరంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగాల్సి ఉంది. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నెల 19 న ఈ మీటింగ్ జరగనుందా అన్నది స్పష్టం కావడంలేదు. తాను మళ్ళీ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టే ప్రసక్తి లేదని ఆల్రెడీ రాహుల్ గాంధీ ప్రకటించారు. కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కోల్పోయాక, బీహార్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దయనీయ పరిస్థితికి దిగజారింది. పార్టీ ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని కపిల్ సిబల్ వంటి నేతలు బాహాటంగానే అంటుండగా, పి.చిదంబరం వంటివారు కూడా మెల్లగా అదే టైపు గళమెత్తుతున్నారు.