తెలంగాణ సీఎం కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజ్‌ని సందర్శించారు. మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకూ దాదాపు 140 కిలో మీటర్ల మేర కళకళలాడుతున్న గోదావరిని వీక్షించేందుకు ఆయా ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. మేడిగడ్డకు చేరుకున్న కేసీఆర్‌కి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం 70, 71 గేట్ల వద్ద గోదావరికి పూలు, పట్టు వస్త్రాలు సమర్పించి సీఎం కేసీఆర్ పూజలు నిర్వహించారు. తరువాత ప్రాజెక్టు తాజా పరిస్థితి పై అధికారులను ఆరా తీశారు. ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని ఆయన సందర్శించారు. శ్రీలక్ష్మీనరసింహస్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన ఆయన స్వామివారి దయవల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పారు. మిషన్ భగీరథ అద్భుత ఫలితాలనిస్తుందన్నారు. ఇంటింటికి సురక్షిత త్రాగునీరే తమ లక్ష్యమని.. త్వరలోనే ఈ కల నెరవేరబోతోందని కేసీఆర్ చెప్పారు.