రాష్ట్రాన్ని నైపుణ్య వికాస కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 30 కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శిక్షణా కేంద్రాల పర్యవేక్షణకు కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. నెలన్నరలోనే డిజైన్లు సహా ఆర్థిక వనరులు సమీకరించి ఏడాదిలోపు నిర్మాణాలను పూర్తి చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
కాగా.. విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి విభాగాలు కలిసి పనిచేయాలని సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖలపై సీఎం సమీక్షించారు. పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున, నాలుగు ట్రిపుల్ ఐటీలకు అనుబంధంగా నాలుగు కేంద్రాలు సహా పులివెందుల జేఎన్టీయూకు అనుబంధంగా మరొక కేంద్రం ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి గొప్ప ఊతమిచ్చేలా ఈ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను తీర్చిదిద్దాలని సూచించారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో హై ఎండ్ స్కిల్స్‌పై ఓ సంస్థను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇంజినీరింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఇందులో ప్రవేశం కల్పించి వారిని మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని సూచించారు. తర్వాత దీనికి అనుబంధంగా సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలో మరో రెండు సంస్థలను ఏర్పాటు చేసే దిశగా ప్రణాళిక రూపొందించాలన్నారు.