దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియకు చురుకుగా ఏర్పాట్లు .. ఢిల్లీలో రోజుకు వందమందికి టీకా పంపిణీః కేజ్రీవాల్
ఢిల్లీలో ముందుగా 81 ప్రాంతాల్లో కరోనా వ్యాక్సిన్ వేయనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు అధికారులు సిద్ధమవుతున్నారు. టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోది శనివారం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో టీకా పంపిణీకి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఢిల్లీలో ముందుగా 81 ప్రాంతాల్లో కరోనా వ్యాక్సిన్ వేయనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలోని ఎంపికచేసిన కొన్ని ప్రాంతాల్లో రోజుకు వందమందికి వ్యాక్సిన్ వేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఢిల్లీ వ్యాప్తంగా రోజుకు 8,100 మందికి కోవిడ్ టీకాలు వేయనున్నారు. వారంలో నాలుగు రోజులు అంటే సోమ, మంగళ, గురు, శనివారాలలో టీకాలు వేయనున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. తరువాతి కాలంలో ఈ టీకా కేంద్రాలను 1,000 వరకూ పెంచనున్నట్లు వెల్లడించారు. ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి ప్రస్తుతానికి 2,74,000 టీకాలు అందాయన్న సీఎం కేజ్రీవాల్.. టీకాలు వేసేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఒక్కోవ్యక్తికి రెండు డోసుల వ్యాక్సిన్ వేయనున్నారని తెలిపారు. ప్రస్తుతానికి ఢిల్లీకి అందిన వ్యాక్సిన్‌ను తొలుత ఆరోగ్య కార్యకర్తలకు వేయనున్నారన్నారు.
దేశవ్యాప్తంగా గత ఏడాది మార్చిలో మొదలైన కరోనా కల్లోలానికి జనం భయంతో వణికిపోయారు. జూన్, జులై నాటికి కరోనా తీవ్ర స్థాయికి చేరుకుంది. మందులేని రోగాన్ని ఎలా నయం చేయాలో తెలియక డాక్టర్లు, దాని బారి నుంచి ఎలా బయటపడాలో తెలియక ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఏడాది కాలంగా నిర్విరామంగా ప్రయోగాలు చేసిన ప్రపంచ ఔషధ కంపెనీలు కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్‌ను రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతినిచ్చింది. దీంతో రేపటి నుంచి వ్యాక్సినేషన్ మొదలుకానుంది.
The Delhi government is fully prepared for the administration of COVID vaccine in Delhi | LIVE https://t.co/W2qnqJFlUF
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 14, 2021
Read Also… అమెరికా ఆర్థిక వ్యవస్థపై కొత్త సర్కార్ కీలక ప్రకటన.. మార్క్ చూపించేందుకు ప్రయత్నిస్తున్న జో బైడెన్