ముంచుకొస్తున్న ప్లాస్టిక్ ముప్పు.. 2030కి మరింత దారుణం.!
కెనడా బృందం చేసిన అధ్యయనం ప్రకారం.. 2030 నాటికి ప్రపంచ జలాల్లో 5.30 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు చేరతాయని తేలింది.

మానవ మనుగడలో ప్లాస్టిక్ ఓ భాగమైపోయింది. అటు ప్రభుత్వాలు.. ఇటు స్వచ్చంద సంస్థలు ప్లాస్టిక్ వాడకాన్ని నివారించేందుకు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీనితో నదులు, సముద్రాలు, చెరువులు.. ఇలా ప్రతీ చోటా ప్లాస్టిక్ వ్యర్ధాలు ఎక్కువైపోతున్నాయి. అయితే తాజాగా ఈ ప్లాస్టిక్ వ్యర్ధాలపై ఓ కెనడా బృందం చేసిన అధ్యయనం ప్రకారం.. 2030 నాటికి ప్రపంచ జలాల్లో 53 మిలియన్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు చేరతాయని తేలింది.
ఇది 2005వ సంవత్సరం ప్లాస్టిక్ వ్యర్దాలతో పోలిస్తే ఏడురెట్లు ఎక్కువ. ప్రస్తుతం ప్రతీ ఏడాది దాదాపుగా ఎనిమిది మిలియన్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు ప్రపంచ జలాల్లో చేరుతున్నాయని.. ఇదే పరంగా కొనసాగితే 2030 నాటికి ప్లాస్టిక్ వ్యర్ధాలు గణనీయంగా 53 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరుగుతుందని అధ్యయనం పేర్కొంది. (Global plastic waste Increase By 2030)
”ఈ పరిస్థితుల్లో ప్రపంచదేశాలన్నీ కూడా ఒకే ధాటిపైకి వచ్చి.. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిస్థాయిలో నిలిపివేయాలి. అంతేకాకుండా ప్లాస్టిక్ పై నిషేధం కూడా విధించాలి. ఇక ప్లాస్టిక్ వ్యర్దాలన్నింటిని సేకరించి రీ-సైకిలింగ్ చేయాలి. లేదంటే భవిష్యత్తు తరాలు ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి” అని టొరాంటో యూనివర్శిటీ కన్జర్వేషన్ బయాలజిస్ట్ స్టీఫెనీ బొరెల్లీ వెల్లడించారు.
2015లో దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్ధాలు రీ-సైకిలింగ్‌కు పనికి రావని తేలాయి. బీచ్‌ల దగ్గర ప్రతీ ఏటా లక్షలలో కార్యకర్తలు ప్లాస్టిక్ వ్యర్ధాలు ఏరేందుకు పాల్గొంటూ ఉంటారు. 2030 నాటికి కనీసం వంద కోట్ల మంది ప్లాస్టిక్ వ్యర్ధాలు ఏరేందుకు పాల్గొంటే తప్ప పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉండదని బొరెల్లీ హెచ్చరించారు.
Also Read:
మందుబాబులకు మరో గుడ్ న్యూస్.. ఏపీలో బార్లకు గ్రీన్ సిగ్నల్..
శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..
