మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లో కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఇప్పుడు ఈ కొత్త ఇంటి విశేషాలు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. నిర్మాణం తుది దశకు చేరుకున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ భారీ స్థాయిలో గృహప్రవేశానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
గత కొంత కాలంగా కొనసాగుతున్న ఈ భవన నిర్మాణం ఇంకొద్ది రోజుల్లో పూర్తికానుంది. చిరంజీవి ఎంతో ఇష్టపడి ఈ ఇంటిని నిర్మిస్తున్నారు. అందులో భాగంగా కొత్త ఇంటిని మరిన్ని హంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఇదే విషయాన్ని ఆ భవంతికి డిజైన్ అండ్ ప్లానింగ్ చేసిన తహిలియానీ హోమ్స్ నిర్వాహకుల్లో ఒకరైన జహన్ తహిలియానీ వెల్లడించారు.
ఈ కొత్త ఇంటిని దాదాపు 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మిస్తూ.. సకల సదుపాయాలతో పాటు, అనేక ఖరీదైన వస్తువులను ఇంట్లో సమకూర్చనున్నారట. ముఖ్యంగా ఇంటీరియర్ డెకోరేషన్‌కు పెద్ద పీట వేస్తున్నారు. ముఖ్యంగా బెడ్ రూమ్‌ను నగలు, ఆభరణాల తయారీలో వాడే పచ్చరాళ్లను ఉపయోగించి పెద్దగా రూపొందించారట.
దీనికి తోడు ఇంట్లో ప్రత్యేకంగా ఓ పెద్ద పూజగదిని కూడా నిర్మించారట. మరోవైపు రామ్ చరణ్, ఉపాసన దగ్గరుండి పనుల్నీ పర్యవేక్షిస్తున్నారని, హైదరాబాద్ సంస్కృతి అద్దం పట్టేలా ఈ కొత్త ఇల్లు ఉండబోతుందని తెలుస్తోంది. అంతేకాదు ప్రారంభోత్సవానికి తెలుగు ఇండస్ట్రీతో పాటు, అటు తమిళ, హిందీ ఇండస్ట్రీలోని ప్రముఖుల్ని పిలవనున్నారని సమాచారం. గృహప్రవేశ సమయంలో మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి భారీ స్థాయిలో గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తోందని, మెగా ఫ్యామిలీకి సంబంధించిన బంధువులు, సన్నిహితులను పెద్ద స్థాయిలో ఆహ్వానించి భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.