నీటి కరువుతో తమిళనాడు తల్లడిల్లుతోంది. జూన్ నెల వస్తున్నప్పటికి తమిళనాడులో నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రిజర్వాయర్లు ఎండిపోయి.. చుక్కనీటి కోసం ట్యాంకర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. లాటరీల పద్దతిలో బిందె నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. నీటి ట్యాంకర్ల దగ్గర యుద్దాలు జరుగుతున్నాయి.
తమిళనాడులో నీటి ఎద్దడిపై ప్రతిపక్షం ఆందోళన చేపట్టింది. డీఎంకే ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. నీటి సమస్యను పరిష్కరించడంలో అన్నాడీఎంకే ఘోరంగా విఫలమైందని డీఎంకే నేతలు మండిపడ్డారు. వేలాదిగా తరలివచ్చిన మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాగునీటి అవసరాలను తీర్చకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మహిళలు మండిపడ్డారు. రోడ్డుపైకి వచ్చి ఖాళీ బిందెలతో నిరసన చేస్తున్నా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆరోపించారు. దాదాపు 200 వందల రోజుల్లో చుక్క వర్షపు నీరు పడలేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
చెన్నైకి నీటి సరఫరా చేసే జలాశయాలు అడుగంటిపోవడంతో ప్రభుత్వం చేతులెత్తేసింది. ఎక్కడ చూసినా ఖాళీ బిందెలు దర్శనమిస్తున్నాయి. చాలామంది ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. చెన్నైలో నీటి అవసరాలకు ప్రతిరోజు 80 కోట్ల లీటర్ల నీరు అవసరమౌతుంది. అయితే ప్రభుత్వం 50 కోట్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తోంది. అసలు నీటి కష్టాలు తెలుసుకోవాలంటే చెన్నైలోని వల్లవరం ప్రాంతానికి వెళ్లాలి. అక్కడ విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఆ ప్రాంతంలో మొత్తం నూటపది కుటుంబాలున్నాయి. వీరందరికి ఒకటే బావి నుంచి నీరు సరఫరా అవుతాయి. అయితే అది కాస్త అడుగంటిపోయింది. పరిస్థితి మారడంతో అందరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. ప్రతిరోజు లక్కీడ్రా తీస్తారు. డ్రాలో గెలిచిన వారు మాత్రమే బావి నుంచి నీరు తోడుకోవాలి.