AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: చోరీ సొత్తు పంపకాలలో తేడాలు.. స్నేహితుడినే హత్య చేసి క్వారీ గుంతలో పడేశారా?

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో క్వారీ గుంతలో నాగేశ్వరరావు మృతదేహం లభించడం కలకలం రేపింది. స్నేహితులైన సుబ్బారావు, దుర్గాప్రసాద్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. చోరీ సొత్తు పంపకాల విషయంలో వివాదం హత్యకు దారితీసిందా? లేక ప్రమాదవశాత్తూ మృతి చెందాడా?

Andhra: చోరీ సొత్తు పంపకాలలో తేడాలు.. స్నేహితుడినే హత్య చేసి క్వారీ గుంతలో పడేశారా?
Nageswara Rao
Ram Naramaneni
|

Updated on: Oct 13, 2026 | 6:40 PM

Share

చోరీ సొత్తు పంపకాల విషయంలో తలెత్తిన వివాదం స్నేహితుడి హత్యకు దారితీసిందా? కలిసి చిన్నచిన్న దొంగతనాలు చేసే ముగ్గురి మధ్య ఏర్పడిన గొడవ చివరకు ఓ వ్యక్తి ప్రాణం తీసిందా? హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని క్వారీ గుంతలో పడేశారా? గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో నాగేశ్వరరావు అనుమానాస్పద మృతి కేసులో ఈ ప్రశ్నలు కలకలం రేపుతున్నాయి.

చేబ్రోలు మండలం సుద్దపల్లికి చెందిన నాగేశ్వరరావు, సుబ్బారావు, దుర్గాప్రసాద్‌ స్నేహితులు. వీరు ముగ్గురూ కలిసి చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే నాగేశ్వరరావు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం స్థానికంగా సంచలనంగా మారింది.

పోలీసుల దర్యాప్తు వివరాల ప్రకారం.. రెండు నుంచి నాలుగు రోజుల క్రితం నాగేశ్వరరావు ఓ మద్యం దుకాణం వద్ద మద్యం సేవిస్తుండగా సుబ్బారావు అక్కడికి వచ్చాడు. అనంతరం నాగేశ్వరరావును తన బైక్‌పై తీసుకెళ్లాడు. మార్గమధ్యలో దుర్గాప్రసాద్‌ కూడా వారితో కలిశాడు. ముగ్గురూ కలిసి గ్రామ సమీపంలోని ఓ క్వారీ గుంత వద్దకు వెళ్లారు. అక్కడ కొంతసేపు గడిపిన తర్వాత సుబ్బారావు, దుర్గాప్రసాద్‌ గ్రామంలోకి వచ్చి నాగేశ్వరరావు చేపలు పట్టేందుకు క్వారీ గుంతలోకి దిగి కనిపించకుండా పోయాడని చెప్పినట్లు సమాచారం.

దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, స్థానికులు కలిసి క్వారీ గుంతలో వెతకగా నాగేశ్వరరావు మృతదేహం లభ్యమైంది. అయితే మృతదేహంపై గాయాలు ఉండటాన్ని గమనించిన నాగేశ్వరరావు తల్లి.. తన కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేసింది. అతడిని హత్య చేసి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మృతదేహంపై గాయాలు.. అనుమానంతో విచారణ

నాగేశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. నాగేశ్వరరావును సుబ్బారావు బైక్‌పై తీసుకెళ్లిన విషయం గుర్తించి అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఇదే సమయంలో క్వారీ గుంత వద్ద ముగ్గురి మధ్య ఘర్షణ జరిగినట్లు కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సుబ్బారావుతో పాటు దుర్గాప్రసాద్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారించారు.

చోరీ సొత్తు పంపకాలే కారణమా?

విచారణలో ముగ్గురూ కలిసి దొంగతనాలకు పాల్పడుతున్న అంశం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. చోరీ చేసిన సొత్తును పంచుకునే విషయంలోనే ముగ్గురి మధ్య వివాదం తలెత్తిందా? ఎంత మొత్తంలో డబ్బు లేదా ఇతర వస్తువుల పంపకాల విషయంలో గొడవ జరిగింది? ఆ ఘర్షణే నాగేశ్వరరావు మృతికి కారణమైందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నాగేశ్వరరావును హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని క్వారీ గుంతలో పడేసి, అతడు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయాలపై పోలీసుల అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.

ప్రస్తుతం సుబ్బారావు, దుర్గాప్రసాద్‌ పోలీసుల అదుపులో ఉండగా.. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. దర్యాప్తు పూర్తయ్యాక నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం ఉంది. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా నాగేశ్వరరావు మృతికి దారితీసిన అసలు కారణాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Follow Us