లైంగికదాడి కేసుల్లో కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాలు

|

Oct 10, 2020 | 3:01 PM

మహిళల పట్ల భద్రతా భరోసా కల్పించేందుకు కేంద్రం మరోసారి రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. మహిళలపై జరిగే నేరాలను ఏమాత్రం ఉపేక్షించేంది లేదని స్పష్టం చేసింది.

లైంగికదాడి కేసుల్లో కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాలు
Follow us on

గత కొద్ది రోజులుగా దేశంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. హాత్రాస్ ఆత్యాచార ఘటన తరువాత దేశంలో పలు చోట్ల గ్యాంగ్ రేప్ కేసుల సంఖ్య గణనీయంగా నమోదయ్యాయి. ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో గ్యాంగ్ రేప్ చేసి హతమార్చిన బాధితురాలికి న్యాయం జరగలేదని ఇటీవల ఆమె తండ్రి ఆత్మహత్యయత్నానికి సైతం పాల్పడ్డాడు. ఇలాంటి ఘటన నేపథ్యంలో మహిళల పట్ల భద్రతా భరోసా కల్పించేందుకు కేంద్రం మరోసారి రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. మహిళలపై జరిగే నేరాలను ఏమాత్రం ఉపేక్షించేంది లేదని స్పష్టం చేసింది. అంతటి వారినైనా కఠినంగా శిక్షించాలని సూచింది. ముఖ్యంగా అత్యాచారం కేసుల్లో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. లైంగిక దాడుల కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు తప్పనిసరి అని, అంతేగాక ఈ కేసుల్లో 60 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సూచించింది. ఈ నిబంధనలను పోలీసులు కచ్చితంగా పాటించి బాధితులకు పూర్తి న్యాయం చేకూర్చాలని కేంద్రం వెల్లడింది. అలాగే నిబంధనలు పాటించని పోలీసులపైనా కఠిన చర్యలు ఉంటాయని గుర్తుచేసింది. ఈ మేరకు క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని చట్టాలను గుర్తుచేస్తూ ఈ మార్గదర్శకాలు జారీ చేసింది.

కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలుః

  • మహిళలపై లైంగిక దాడి ఘటనల్లో తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి. ఒకవేళ నేరం పోలీస్‌స్టేషన్‌ పరిధి వెలుపల జరిగిన పక్షంలో ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’ నమోదు చేయాలి. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోతే సదరు అధికారి శిక్షార్హుడే.
  • అత్యాచార కేసుల్లో పోలీసుల దర్యాప్తు 60 రోజుల్లోగా పూర్తవ్వాలి. దర్యాప్తులో రాష్ట్ర పోలీసులకు సహకారం అందించేందుకు ‘ఇన్వెస్టిగేషన్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ ఫర్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌’ ఆన్‌లైన్‌ పోర్టల్‌ను కేంద్ర హోంశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది.
  • లైంగికదాడి గురించి సమాచారం అందిన 24 గంటల్లోగా బాధితురాలికి వైద్యపరీక్షలు నిర్వహించాలి.
  • న్యాయాధికారి ముందు రికార్డు చేయనప్పటికీ బాధితురాలి మరణ వాంగ్మూలం ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి.
  • లైంగిక దాడుల కేసుల్లో సాక్ష్యాలను సేకరించేందుకు సెక్సువల్‌ అసల్ట్‌ ఎవిడెన్స్‌ కలెక్షన్‌ కిట్లను ఉపయోగించాలి.
  • పోలీసులు నిబంధనలకు పాటించకపోతే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.