#India locked down వలస బతుకులపై కేంద్రం నజర్.. అమిత్‌షా ఆదేశాలివే

దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్ళడంతో దేశంలో నలుమూలలా ఉపాధి కోసం వలస వెళ్ళి బతుకులీడుస్తున్న జీవులు పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే...

#India locked down వలస బతుకులపై కేంద్రం నజర్.. అమిత్‌షా ఆదేశాలివే

Updated on: Mar 28, 2020 | 3:47 PM

Home ministry fresh directions to states: దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్ళడంతో దేశంలో నలుమూలలా ఉపాధి కోసం వలస వెళ్ళి బతుకులీడుస్తున్న జీవులు పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ‌లాక్‌డౌన్ వల్ల అత్యధికంగా నరకప్రాయమైన జీవితం గడుపుతోంది వలస జీవులే. అయితే.. లాక్‌డౌన్ ప్రకటించిన రెండు, మూడు రోజుల తర్వాత గానీ ఈ రకమైన వలస జీవులపై ప్రభుత్వాలు పెద్దగా ఫోకస్ చేయలేదు.

కానీ… వందల మైళ్ళ దూరంలోని తమ స్వస్థలాలకు వెళ్ళేందుకు వాహనాలు లేక… కాలినడకన బయలు దేరిన వలస జీవులు ఇపుడు జాతీయ రహదారులపై పెద్ద సంఖ్యలో కనిపిస్తుండడం.. ఎండకు ఎండుతూ.. తినడానికి తిండి లేక వారు తరలివెళుతున్న దృశ్యాలు మనసులను కలచి వేస్తుంటే ప్రభుత్వాలు కూడా స్పందించక తప్పని పరిస్థితి. ఎక్కడి వారక్కడే వుండడం వారికి తిండి, వసతి సౌకర్యాలను కల్పిస్తామని ప్రభుత్వాలు ప్రకటించడం రెండు రోజులుగా వింటూ వున్నాం. కానీ.. ఈ పాటికే చాలా మంది మార్గమధ్యంలో వుండడంతో అటు వెనక్కి వెళ్ళలేక, ఇటు ముందుకు సాగలేక.. ఇలా వలస జీవులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి.

ఈ క్రమంలో ఎక్కడెక్కడో వున్న వివిధ రాష్ట్రాల వారు.. వారి వారి ప్రభుత్వాలకు, ముఖ్యమంత్రులకు ఆదుకోవాలంటూ వీడియో సందేశాలను పంపుతున్నారు. వాటిని మీడియాతో షేర్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారికి సంబంధించిన వార్తలు మీడియాలో పెద్ద ఎత్తున దర్శనమివ్వడంతో.. కేంద్ర హోం శాఖ రెండు రోజుల వ్యవధిలో మరోసారి స్పందించింది. వలస జీవులకు ఆశ్రయం కల్పించే విషయంతో స్థానిక ప్రభుత్వాలు ప్రాధాన్యతతో ముందుకు రావాలని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా శనివారం మరోసారి రాష్ట్రాలను కోరారు.

వలస కూలీలకు, వారి కుటుంబీకులకు తాత్కాలిక వసతి, భోజనం, వైద్య సదుపాయాలు, దుస్తులు అందజేయాలని అమిత్ ‌షా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. అందుకయ్యే ఖర్చులకు స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నిధులను ఉపయోగించుకునే వెసులుబాటును హోంశాఖ కల్పించింది. వలస జీవుల కుటుంబాలకు ఆశ్రయం కల్పించేందుకు నగరాల శివార్లలోను ఫంక్షన్ హాళ్ళను వినియోగించుకోవాలని అమిత్ షా రాష్ట్రాలకు సూచించారు.