ఆ దేశాధ్యక్షుడు కరోనాతో మృతి చెందాడా..?
బురుండీ దేశాధ్యక్షుడు ఎన్. కురుంజిజా(55) బుధవారం మరణించినట్లు అధికారులు ప్రకటించారు.

మాయదారి కరోనా ధాటికి ప్రపంచం చిగురుటాకులా వణుకుతోంది. సామాన్యుడి నుంచి సెలబ్రేటీల దాకా కొవిడ్ సోకుతోంది. తాజాగా ఆఫ్రికా ఖండానికి చెందిన ఓ దేశాధ్యక్షుడు కరోనాతో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. బురుండీ దేశాధ్యక్షుడు ఎన్. కురుంజిజా(55) బుధవారం మరణించినట్లు అధికారులు ప్రకటించారు. గత శనివారం స్వల్ప అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. అనంతరం పూర్తిగా కోలుకున్నారని డాక్టర్లు తెలిపారు. అయితే ఇవాళ కురుంజిజా మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. అయితే, గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు చెబుతున్నా ఆయనకు కరోనా వైరస్ సోకిందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇటీవలే కురుంజిజా భార్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె కెన్యాలోని ఆగాఖాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కురుంజిజా మృతికి కరోనాయే కారణమై ఉంటుందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది.
