రైతుల సమస్యపై వారి ట్రోలింగ్ కి కారణం కేంద్రమే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన రాజ్ థాక్రే
రైతుల ఆందోళన విషయంలో వ్యవసాయ చట్టాలను సమర్థించేట్టు ట్వీట్స్ చేయాల్సిందిగా లతా మంగేష్కర్, సచిన్ టెండూల్కర్ వంటి సెలబ్రిటీలను..
రైతుల ఆందోళన విషయంలో వ్యవసాయ చట్టాలను సమర్థించేట్టు ట్వీట్స్ చేయాల్సిందిగా లతా మంగేష్కర్, సచిన్ టెండూల్కర్ వంటి సెలబ్రిటీలను కేంద్రం కోరడాన్ని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన నేత రాజ్ థాక్రే తప్పు పట్టారు. ఇది ప్రభుత్వానికి సంబంధించినది కానీ దేశానికి కాదన్నారు. ముంబైలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇలా ట్వీట్స్ పోస్ట్ చేయాలని కోరడంతో వారిని అనేకమంది ట్రోల్ చేశారని అన్నారు. ఫలితంగా ఈ ప్రముఖుల ప్రతిష్ట దెబ్బతినేలా కేంద్రం చూసిందని ఆరోపించారు. ఇది చైనా నుంచో, పాకిస్తాన్ నుంచో దేశానికి ముప్పు పొంచి ఉండడం కాదని, ఇది కేంద్రానికి సంబంధించినదని ఆయన వ్యాఖ్యానించారు. రైతుల సమస్యపై విదేశీ సెలబ్రిటీలు స్పందించినప్పుడు ట్వీట్ల ద్వారా వారికి కౌంటర్ ఇవ్వాలని ప్రభుత్వం సూచించినట్టు చెబుతున్నారు.
లతా మంగేష్కర్, సచిన్ టెండూల్కర్ వంటివారు భారత రత్న పురస్కారాలు పొందినవారని, అలాంటివారిని ఈ విధంగా కోరడం ఏమిటని రాజ్ థాక్రే ప్రశ్నించారు. ఇండియాలో అన్నదాతల ఆందోళనపై అమెరికాకాంగ్రెస్ ఎంపీలైన హేలీ స్టీవెన్స్, ఇల్హన్ ఓమర్ సహా పలువురు ప్రజాప్రతినిధులు స్పందించిన సంగతి తెలిసిందే. వీరంతా మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. అయితే రైతు చట్టాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన విదేశీ ప్రముఖుల ట్వీట్లను భారత ప్రభుత్వం ఒక విధంగా ఖండించింది. ఇది భారత అంతర్గత వ్యవహారమని స్పష్టం చేసింది.