
ప్రజా సమస్యలపై చర్చించేందుకు సమయం అడిగినా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్న కమలనాథులు చలో ప్రగతి భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు డా.లక్ష్మణ్, రామచంద్రరావు, రాజాసింగ్ శుక్రవారం తమ అనుచరగణంతో ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరతారని కమలనాథులు వెల్లడించారు. పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలతో ప్రగతి భవన్ ముట్టడి చేస్తామని బీజేపీ నేతలు ప్రకటించారు.
అధిక విద్యుత్ చార్జీలకు నిరసనగా రేపు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర శాఖ తలపెట్టింది. రాష్ట్రంలో నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం వల్లనే ప్రగతి భవన్ ముట్టడించాలని నిర్ణయించామని బీజేపీ నేతలు ప్రకటించారు. పోలీసులు అనుమతి ఇచ్చినా.. ఇవ్వకపోయినా ప్రగతి భవన్ ముట్టడించి తీరతామని వారంటున్నారు.
కేంద్రం అనేక కోట్ల ఆర్థిక ప్యాకేజీ తెలంగాణకు ఇచ్చిందంటున్న బీజేపీ నేతలు.. వాటిని కేసీఆర్ ప్రభుత్వం ఇతరత్రా డైవర్ట్ చేస్తోందని, పైగా కేంద్రం ఏమీ ఇవ్వడం లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఖర్చుచేసే ఆర్థిక క్రమశిక్షణ రాష్ట్ర ప్రభుత్వనికి లేదని ఆయన అంటున్నారు. మునిసిపల్ కార్పొరేషన్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కేటాయించలేదని, మొత్తం కేంద్రమే ఇచ్చిందని చెబుతున్నారు బీజేపీ నేతలు.
కేంద్రాన్ని విమర్శిండం ముఖ్యమంత్రికి అలవాటుగా మారిందని, తెలంగాణలో కరోన ఆకలి చావులు లేవంటే అది కేంద్ర ప్రభుత్వ చొరవేనని సంజయ్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వైఫల్యం ఏ స్థాయిలో వుందో గాంధీ ఆసుపత్రికి వెళ్తే తెలుస్తుందని సంజయ్ ఎద్దేవా చేశారు. కరోన కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో స్పష్టం చేయగలరా? అని సంజయ్ ప్రశ్నించారు.